రెబల్ స్టార్ అంటే ఆయనే…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కృషితో నాస్తి దుర్భిక్షమ్’అనే నానుడిని నిజం చేసిన వారు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో కృష్ణంరాజు స్థానం ప్రత్యేకమైనది. తొలి చిత్రం పరాజయం చవిచూసినా, పట్టువదలని విక్రమార్కునిలా చిత్రసీమలో పలు పాట్లు పడ్డారు. చివరకు కోరుకున్న విజయం సాధించారు. జనం మదిలో ‘రెబల్ స్టార్’గా నిలచిపోయారు.
కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ కృష్ణంరాజుకు ఫోటోలు తీయడమంటే ఎంతో ఇష్టం. ‘ఆంధ్రరత్న’ అనే పత్రికకు ఫోటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో బెస్ట్ ఫోటోగ్రాఫర్‌గా సెకండ్ ప్రైజ్ సంపాదించారు. తరువాత ఆయన మనసు నాటకాల వైపు మళ్ళింది. అదే ఆయనను సినిమా రంగంవైపు అడుగులు వేయించింది. 1966లో కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో ‘చిలకా-గోరింకా’ అనే చిత్రంలో హీరోగా పరిచయం అయ్యారు. నాటి మేటి హీరోయిన్ కృష్ణకుమారి ఆయన సరసన నాయికగా నటించారు. ఆ చిత్రం పరాజయం పాలయింది. దాంతో కృష్ణంరాజును ఐరన్ లెగ్ అనుకున్నారు సినీజనం.
Also Read
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
సినిమా రంగంలో ఎలాగైనా రాణించాలన్నదే కృష్ణంరాజు లక్ష్యం. పోయినదగ్గరే వెదుక్కోవాలి అన్నట్టు తన మనసు పారేసుకున్న చిత్రసీమలోనే ఉండాలని నిర్ణయించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ చిత్రాలలో బిట్ రోల్స్, కీలక పాత్రలు పోషించారు. శోభన్ బాబు, కృష్ణ సినిమాల్లో ప్రతినాయకునిగానూ నటించారు. మధ్య మధ్యలో మిత్రులు తీసిన చిత్రాలలో హీరోగా నటించినా, అవేవీ ఆదుకోలేకపోయాయి. దాంతో తన మిత్రుడు కృష్ణను స్ఫూర్తిగా తీసుకొని, తానూ సొంత చిత్రాలు నిర్మించి, హీరోగా నటించి రాణించాలనుకున్నారు. ఆ సమయంలో కృష్ణంరాజుకు చలసాని గోపి, చేగొండి హరిబాబు కూడా మద్దతుగా నిలిచారు. తొలుత మిత్రుల సహకారంతో ‘కృష్ణవేణి’ నిర్మించి, నటించారు. కన్నడ ‘శరపంజర’ ఆధారంగా తెరకెక్కిన ‘కృష్ణవేణి’ తెలుగులోనూ మంచి విజయం సాధించింది. ఆ తరువాత కృష్ణంరాజును హీరో వేషాలు పలకరించసాగాయి. ఆ సినిమాలు విజయం సాధించకపోవడంతో మళ్ళీ సాహసం చేశారు కృష్ణంరాజు. ఈ సారి, తన తమ్ముడు యు.సూర్యనారాయణరాజు (ప్రభాస్ తండ్రి)ని నిర్మాతగా పెట్టి గోపీకృష్ణా మూవీస్ పతాకంపై బాపు దర్శకత్వంలో ‘భక్త కన్నప్ప’ నిర్మించారు. ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది. అక్కడ నుంచీ కృష్ణంరాజు మరి వెను తిరిగి చూసుకోలేదు.
ఇతర నిర్మాతల చిత్రాలలో హీరోగా నటిస్తూనే, తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మిస్తూ, అందులో కీలక పాత్రలు పోషిస్తూ ముందుకు సాగారు కృష్ణంరాజు. అనతికాలంలోనే తెలుగునాట కృష్ణంరాజు సొంత నిర్మాణ సంస్థ ‘గోపీకృష్ణామూవీస్’కూ మంచి పేరు లభించింది. తమ చిత్రాలలో సంగీతసాహిత్యాలకు పెద్ద పీట వేసేవారు రాజు. కొన్ని చిత్రాలను తన మిత్రుడు, మేకప్ ఛీప్ జయకృష్ణతోనూ కలసి నిర్మించారు కృష్ణంరాజు. ఆయన సొంత చిత్రాలలో “అమరదీపం, మనవూరి పాండవులు, శివమెత్తిన సత్యం, సీతారాములు, బొబ్బిలి బ్రహ్మన్న” ద్వారా నటునిగా మంచి పేరు సంపాదించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నంది అవార్డులలో ఉత్తమనటుడు విభాగం ప్రవేశ పెట్టగానే, ఆ కేటగిరీలో ‘అమరదీపం’ ద్వారా ఉత్తమనటునిగా నిలిచారు కృష్ణంరాజు. సొంత చిత్రాలను మినహాయిస్తే, బయటి చిత్రాలలో విజయమాధవీ పిక్చర్స్ పతాకంపై దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణంరాజు నటించిన ‘కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ’ మాస్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాల తరువాతనే కృష్ణంరాజు ‘రెబల్ స్టార్’గా అభిమానుల మదిలో నిలిచారు.
‘రెబల్ స్టార్’ అన్న ముద్ర ఉంది. పైగా మాస్ ను ఆకట్టుకొనే రూపం కృష్ణంరాజు సొంతం. అయినా ‘మనవూరి పాండవులు, సీతారాములు, మధురస్వప్నం” వంటి చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషించారాయన. ఇవన్నీ ఆయన సొంత చిత్రాలే కావడం గమనార్హం! ఇక తమ మొగల్తూరుకే చెందిన చిరంజీవిని తన “మనవూరి పాండవులు, ప్రేమతరంగాలు, పులి-బెబ్బులి” వంటి చిత్రాల ద్వారా ప్రోత్సహించారు కృష్ణంరాజు.
చిరంజీవి నెలకొల్పిన ‘ప్రజారాజ్యం’ పార్టీలో చేరి రాజమండ్రి నుండి ఎంపీగా పోటీ చేసి 2009లో ఓటమి చవిచూశారు కృష్ణంరాజు. అంతకు ముందు 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి కూడా ఆయన ఓడిపోయారు. అయితే బీజేపీలో ఉన్న సమయంలో 1999లో కృష్ణంరాజు గెలుపు సాధించారు. ఆ తరువాత కేంద్రమంత్రిగానూ విధులు నిర్వర్తించారు. జనవరి 20తో 82 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోన్న కృష్ణంరాజు తాజాగా తన నటవారసుడు ప్రభాస్ హీరోగా ‘రాధే శ్యామ్’ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరించారు. అంతేకాదు, అందులో ఓ కీలక పాత్రలోనూ ఆయన నటించారు. ఈ యేడాదే ఈ చిత్రం జనం ముందు నిలవనుంది. కృష్ణంరాజు మరిన్ని వసంతాలు ఆనందంగా చూడాలని ఆశిద్దాం.
(ఈరోజు కృష్ణంరాజు పుట్టినరోజు)
తాజావార్తలు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!