ఒకప్పుడు నాజూకు షోకులతో ప్రేక్షకులను పరవశింప చేసిన నటి రవీనా టాండన్ కు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. రవీనా టాండన్ కు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల బాలీవుడ్ లో ఆనందం వెల్లివిరిసింది.
రవీనా టాండన్ ఉత్తరాదిన అజయ్ దేవగన్ తో కలసి అనేక చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు. ఖిలాడీ కుమార్ గా పేరొందిన అక్షయ్ కుమార్ కు జోడీగానూ భలేగా అలరించారు. ఆమిర్ ఖాన్, సంజయ్ దత్ వంటి హీరోలతోనూ భలేగా మురిపించారు. తెలుగు స్టార్ హీరో వెంకటేశ్ హిందీలో నటించిన ‘తక్దీర్ వాలా’లోనూ రవీనా టాండన్ నాయికగా నటించారు.
హిందీ చిత్రాలలో మేటి నాయికగా అలరించిన రవీనా టాండన్ కు తెలుగు చిత్రసీమతోనూ అనుబంధం ఉంది. ‘రథసారథి’ తెలుగు చిత్రంలో వినోద్ కుమార్ సరసన నాయికగా నటించి, తెలుగుతెరకు పరిచయం అయ్యారు రవీనాటాండన్. ఆ పై బాలకృష్ణ ‘బంగారుబుల్లోడు’లోనూ ఓ నాయికగా రవీనా టాండన్ తనదైన అందాల అభినయంతో ఆకట్టుకున్నారు. ఇందులోని వానపాట “స్వాతిలో ముత్యమల్లె…”లో రవీనా టాండన్ బాలయ్యతో కలసి వేసిన చిందులు ప్రేక్షకులకు కనువిందు చేశాయి. నాగార్జున కథానాయకునిగా తెరకెక్కిన ‘ఆకాశవీధిలో…’ చిత్రంలోనూ రవీనా నాయికగా నటించి అలరించారు. 2014లో ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రంలో మోహన్ బాబు జోడీగా నటించీ మురిపించారు రవీనాటాండన్. అందువల్ల అటు హిందీ చిత్రసీమలోనూ, ఇటు తెలుగునాట కూడా రవీనాకు పద్మశ్రీ రావడం పట్ల అభినందనలు వెల్లువెత్తాయి.