అందాల తార రాశీ ఖన్నా ఎప్పుడూ తన పాత్రలో కొత్తదనం కోసం ప్రయత్నించే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటించిన ‘120 బహదూర్’ సినిమా కూడా అలాంటి ఓ ప్రయోగాత్మక ప్రయత్నమే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్‌తో కలిసి రాశీ నటించింది. రెజాంగ్ లా యుద్ధంలో వీరమరణం పొందిన మేజర్ షైతాన్ సింగ్ భాటి గారి జీవితంపై ఈ చిత్రం ఆధారంగా రూపొందింది. భారత సైనికుల ధైర్యసాహసాలు, వారి కుటుంబాలు ఎదుర్కొనే భావోద్వేగ క్షణాలు ఈ సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారు.
Also Read : Sreeleela : ఫెయిల్యూర్స్‌కి ఫుల్స్టాప్.. ‘పరాశక్తి’తో తిరిగి ఫామ్‌లోకి శ్రీలీల..
కాగా ఇందులో రాశీ షాగున్ సింగ్ అనే సైనికుడి భార్య పాత్రలో నటించింది. ఈ పాత్ర చాలా లోతైన భావోద్వేగాలతో నిండి ఉందని ఆమె చెబుతోంది. ‘‘ఈ సినిమాలో నేను చేసిన పాత్ర నా కెరీర్లో చాలా సవాలుతో కూడుకున్నది. యుద్ధానికి వెళ్తున్న తన భర్త తిరిగి రాకపోవచ్చనే వాస్తవాన్ని అంగీకరిస్తూ ఒక స్త్రీ జీవించడం ఎంత కష్టమో ఆ భావనను నేను అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. కొన్ని సన్నివేశాల్లో నిజంగా కన్నీళ్లు ఆపుకోలేకపోయాను’’ అని ఆమె తెలిపింది. అలాగే, ‘‘ఒక సైనికుడి భార్య గర్వంగా కూడా ఉంటుంది, భయంతో కూడా జీవిస్తుంది. ఈ రెండు భావాలు ఒకే సమయంలో అనుభవించడం చాలా కష్టమైన విషయం. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని చాలా నిజమైన భావోద్వేగంతో రాశారు. అందుకే ఆ పాత్రలో జీవించాల్సి వచ్చింది, నేను కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే చేయగలనని అనుకునే వారు ఈ సినిమాతో నా మరో వైపు చూస్తారు’’ అని రాశీ చెప్పారు. ఈ నెల 21న విడుదల కానున్న ‘120 బహదూర్’ సినిమా యాక్షన్, దేశభక్తి, భావోద్వేగాలతో నిండిన హృదయాన్ని తాకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశీ ఖన్నా తన నటనతో మళ్లీ ఒకసారి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుందనే నమ్మకం ఆమె అభిమానుల్లో కనిపిస్తుంది.