తమిళనాట విరబూసిన వేయిరేకుల అందాల అరవిందం రమ్యకృష్ణ. తెలుగు సినిమాలతోనే రమ్యకృష్ణ సౌందర్యగంధం విశేషంగా వీచింది. దర్శకేంద్రుని మాయాజాలంతో ఈ అందం ప్రేక్షకులకు బంధాలు వేసింది. ఆ సౌందర్యం గంధాలు పూసింది.ఆ పూతలు ఏ నాటికీ ఇగిరిపోనివి. తరుగులేనివి. తిరుగులేని అభిమానం సొంతం చేసుకున్నవి. ఐదు పదులు దాటినా రమ్యకృష్ణ అందం హిందోళం పాడుతోంది.
రమ్యకృష్ణ 1970 సెప్టెంబర్ 15న మద్రాసులో జన్మించారు. తొలి నుంచీ రమ్యకృష్ణకు గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలనే అభిలాష ఉండేది. ఆమె తల్లి కూడా ప్రోత్సహించారు. భరతనాట్యంలో ప్రావీణ్యం పొందాక సినిమాల వేటలో పడ్డారామె. మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన ‘నేరమ్ పులరుంబోల్’ అనే మళయాళ చిత్రంలో తొలిసారి నటించారు రమ్యకృష్ణ. కృష్ణ హీరోగా రూపొందిన `కంచుకాగడా`లో ఓ చిన్న పాత్ర ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టారు రమ్యకృష్ణ.
తరువాత పలు తెలుగు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలే పోషించారు. తన దరికి చేరిన ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకొనే ప్రయత్నం చేశారు. అయితే రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించి, నటించిన `అల్లుడుగారు`తోనే రమ్యకృష్ణకు మంచి విజయం లభించింది. ఆ తరువాత నుంచీ రమ్యకృష్ణ అందం కోసం పందెం వేసుకుంటూ నిర్మాతలు ఆమె కాల్ షీట్స్ కై పరుగులు తీశారు. అయితే రాఘవేంద్రరావు రూపొందించిన “అల్లరి మొగడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, ఘరానా బుల్లోడు, ముగ్గురు మొనగాళ్ళు, ముద్దుల ప్రియుడు, అన్నమయ్య“ చిత్రాలలో రమ్య అందం మరింత సుగంధాలు విరజల్లింది. ఇతర చిత్రాలలో చిరంజీవితో నటించిన `అల్లుడా మజాకా`, బాలకృష్ణతో జోడీ కట్టిన “బంగారుబుల్లోడు, వంశానికొక్కడు“, నాగార్జున సరసన అలరించిన `హలో బ్రదర్` వంటి చిత్రాల్లోనూ రమ్యకృష్ణ అందాలతో మురిపించారు. అందాల ఆరబోతతోనే సాగుతున్న రమ్యకృష్ణకు దాసరి నారాయణరావు `కంటే కూతుర్నే కనాలి` చిత్రం నటిగానూ మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. అదే సమయంలో రజనీకాంత్ `నరసింహ` చిత్రంలో రమ్యకృష్ణ ధరించిన నీలాంబరి పాత్ర ఆమెలోని నటిని మరింతగా వెలికి తీసింది. ఆ తరువాత నుంచీ రమ్యకృష్ణకు అందాల పాత్రలతో పాటు, అభినయ ప్రాధాన్యమున్న కేరెక్టర్స్ కూడా లభించాయి. టాప్ హీరోస్ తో టాప్ హిట్స్ చూసిన రమ్యకృష్ణ యంగ్ హీరోస్ తోనూ చిందేసి కనువిందు చేశారు. `సింహాద్రి` చిత్రంలో జూనియర్ యన్టీఆర్ తో కలసి రమ్యకృష్ణ ఓ ఐటమ్ సాంగ్ లో అలరించిన తీరును జనం మరచిపోలేరు. అందంతో మురిపిస్తూనే, అభినయంతోనూ అలరించడంలో తనదైన బాణీ పలికిస్తూ సాగారు రమ్యకృష్ణ. ఇక అప్పటి దాకా నటించిన పాత్రలన్నీ ఒక ఎత్తు, `బాహుబలి` సీరీస్ లో ధరించిన శివగామి దేవి పాత్ర ఒక్కటీ మరో ఎత్తు అన్న రీతిలో రమ్యకృష్ణ అభినయం సాగింది. ఉత్తరాదిన సైతం కొన్ని చిత్రాలలో రమ్య అందం మురిపించింది. ఇక దక్షిణాది అన్ని భాషల్లోనూ ఆమె అభినయం అలరించింది.
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని పెళ్ళాడిన రమ్యకృష్ణకు ఓ బాబు. ప్రస్తుతం రమ్యకృష్ణ తన దరికి చేరిన పాత్రల్లో నచ్చినవాటిని ఎంచుకొని జనం మెచ్చేలా అభినయిస్తున్నారు. పూరి జగన్నాథ్ ‘లైగర్’ ఫలితం ఎలా ఉన్నా రమ్యకృష్ణ అభినయం మాత్రం జనాన్ని ఆకట్టుకుంది. భవిష్యత్ లోనూ రమ్యకృష్ణ మరిన్ని పాత్రల్లో నటిస్తూ జనాన్ని మరెంతగానో అలరిస్తారని ఆశిద్దాం.