వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నిర్మాత నట్టి కుమార్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వర్మ తన సినిమాలకు నట్టి కుమార్ వద్ద రూ.5 కోట్ల 29 లక్షలు తిరిగి ఇవ్వలేదని, ఆ డబ్బు తిరిగి చెల్లించేవరకు మా ఇష్టం సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలని నట్టి కుమార్ కేసు వేశాడు. దీంతో కోర్టు సినిమాను రిలీజ్ చేయకుండా స్టే విధించింది. ఇక రామ్ గోపాల్ వర్మ ఒక మోసగాడు, అతడి బండారం బయటపెడతాను అంటూ నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెల్సిందే. ఇక తాజాగా ఈ వివాదంపై వర్మ స్పందించాడు. ఒక వీడియో ద్వారా నట్టి కుమార్ చేసిన ఆరోపణలను పెద్దగా పట్టించుకోనవసరం లేదని తేల్చి చెప్పాడు. ” నట్టికుమార్ నాపై చేసిన ఆరోపణలు, అభియోగాలు లీగల్‌గా ఉండి నోటీసులు ఇస్తే, వాటికి నా అడ్వకేట్ సరైన సమాధానం ఇస్తారు. ఇక నాపై అతను చేసిన వ్యక్తిగత ఆరోపణల గురించి చెప్పను. దానికి సమాధానం ఎలా చెప్పాలో నాకు తెలుసు. ఎందుకంటే నట్టి కుమార్ గురించి అందరికీ తెలిసిందే.
అతడికి ప్రెస్ మీట్లు పెట్టి ఎదుటివారిపై ఆరోపణలు చేయడమే తెలుసు.. ఇండస్ట్రీలో ఎవరో ఒకరి మీద ఆరోపణలు చేయడం, ప్రెస్‌మీట్స్ పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మినహా అతను పెద్దగా చేసేది కూడా ఏమీ లేదు. గతంలో చిరంజీవిగారు, సురేశ్‌బాబు మీద ఇలాగే ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలు చేశారు. ఇప్పుడు నాపైన చేస్తున్నాడు. తన కూతురు, కొడుకు సినిమాలకు సపోర్ట్ చేయలేదని, కమీషన్ రాలేదని కొందరిని దూషించాడు. అవన్నీ నా లీగల్ అడ్వకేట్ చూసుకుంటాడు. ఇక నా సినిమా రిలీజ్ వాయిదా పడడానికి ఇది కారణం కాదు. దానికి సమాధానం త్వరలో చెబుతా. ఇకపై నట్టి కుమార్ గురించి నేను ఎక్కడా మాట్లాడను. ఎందుకంటే నేను ఇంపార్టెన్స్ ఇచ్చే అంత సీన్, అర్హత అతనికి లేదు. లీగల్ ఆస్పెక్ట్‌లో ఏం చేసిన మా అడ్వకేట్ చూసుకుంటారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.