తెలుగు చిత్రసీమలో చిరస్మరణీయులు మూవీ మొఘల్ డి.రామానాయుడు. ఆ పేరు తలచుకోగానే ఆయన సాధించిన అపూర్వ విజయాలు ముందుగా గుర్తుకు వస్తాయి. ప్రపంచంలోనే అత్యధిక కథా చిత్రాలను నిర్మించి, గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన తీరు మన మదిలో మెదలుతుంది. భారతదేశంలోని 14 భాషల్లో 12 ప్రముఖ భాషల్లో చిత్రాలను నిర్మించి, దేశంలోనూ ఘనతను సాధించారు. అనితరసాధ్యంగా రామానాయుడు సాగిన తీరును గుర్తు చేసుకుంటే మనసు పులకించి పోవలసిందే. అందుకే భావి నిర్మాతలెందరో ఆయననే ఆదర్శంగా తీసుకొని చిత్రసీమలో అడుగు పెడుతూ ఉంటారు. నవతరం సైతం రామానాయుడు కీర్తి శిఖరం నుండి స్ఫూర్తిని పొందుతూనే ఉంది.
దగ్గుబాటి రామానాయుడు 1936 జూన్ 6వ తేదీన గుంటూరు జిల్లా కారంచేడులో జన్మించారు. సంపన్నుల కుటుంబంలో జన్మించిన రామానాయుడుకు చిన్నతనం నుంచీ ఏ పనిచేసినా అంకితభావంతో చేయడం అలవాటయింది. రైతుబిడ్డ కాబట్టి చదువుకుంటూనే పొలం పనుల్లోనూ దిట్టగా సాగారు. ఊరిలో ఏ సమస్య వచ్చినా ముందుండేవారు. రామానాయుడు సమీపబంధువు యార్లగడ్డ వెంకన్న చౌదరి, ఏయన్నార్ హీరోగా ‘నమ్మిన బంటు’ చిత్రాన్ని నిర్మిస్తున్న రోజులవి. కొంతభాగాన్ని కారంచేడులోనూ చిత్రీకరించారు. ఆ సమయంలో ఆ సినిమా షూటింగ్ లో యూనిట్ వారికి కావలసినవి సమకూరుస్తూ హుషారుగా పాలు పంచుకున్నారు రామానాయుడు. ఆయన ఉత్సాహం చూసి నువ్వూ సినిమాల్లోకి రారాదు అని ప్రోత్సహించారు ఆ చిత్రబృందంలోని సభ్యులు. ఆ ప్రోత్సాహంతోనే ఆయన సినిమా రంగంవైపు అడుగులు వేశారు. రామానాయుడు నటుడు కావాలనే చిత్రసీమలో అడుగుపెట్టారు. అయితే నటన కన్నా నిర్మాణం మేలని భావించి, తొలుత ‘అనురాగం’ అనే చిత్రానికి స్లీపింగ్ పార్ట్ నర్ గా ఉన్నారు. ఆపై సొంతగా ‘సురేశ్ ప్రొడక్షన్స్’ సంస్థను స్థాపించి, తొలి ప్రయత్నంలోనే యన్టీఆర్ తో ‘రాముడు-భీముడు’ నిర్మించారు. యన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రంగా ‘రాముడు-భీముడు’ జనం మదిని గెలిచింది. ఆ సినిమా డ్యుయల్ రోల్స్ కు ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలచింది. తరువాత యన్టీఆర్ తో ‘శ్రీకృష్ణతులాభారం, స్త్రీజన్మ’ చిత్రాలు నిర్మించారు. కాంతారావుతో ‘ప్రతిజ్ఞాపాలన, బొమ్మలు చెప్పిన కథ’, ఏయన్నార్ తో ‘సిపాయి చిన్నయ్య, ప్రేమనగర్, సెక్రటరీ, చిలిపికృష్ణుడు, ప్రేమమందిరం” చిత్రాలు, శోభన్ బాబుతో “జీవనతరంగాలు, చక్రవాకం, సోగ్గాడు, దేవత, ఎంకి-నాయుడు బావ” వంటి సినిమాలు, కృష్ణతో ‘సావాసగాళ్ళు’, కృష్ణంరాజుతో ‘అగ్నిపూలు’, చిరంజీవితో ‘సంఘర్షణ’, బాలకృష్ణతో ‘కథానాయకుడు, రాము’, నాగార్జునతో ‘చినబాబు’, వెంకటేశ్ తో ‘కలియుగ పాండవులు, బ్రహ్మపుత్రుడు, బొబ్బిలిరాజా, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా, కూలీ నంబర్ వన్” వంటి చిత్రాలు నిర్మించారు. వీరితోనే కాక సురేశ్, జె.డి.చక్రవర్తి, శ్రీకాంత్ వంటి హీరోలతోనూ చిత్రాలు నిర్మించి అలరించారు రామానాయుడు.
మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా, పంజాబీ, భోజ్ పురి, గుజరాతీ, అస్సామీ భాషల్లోనూ చిత్రాలు నిర్మించి భళా అనిపించారు రామానాయుడు. ఓ నిర్మాత ఇన్ని భాషల్లో సినిమాలు నిర్మించడం నిజంగా విశేషమే. భారతదేశంలో 12 భాషల్లో సినిమాలు తీసిన చరిత్ర మరొకరికి కానరాదు.
రామానాయుడు తాను చేసే ఏ పనినైనా త్రికరణ శుద్ధిగా చేసేవారు. తాను ఇష్టపడిన సినిమాను మరింతగా అభిమానించారు. ఎంతగా అంటే సినిమా ఆయనకు ఓ వ్యసనంగా మారింది. సినిమానే ఆయనకు శ్వాస అయింది. తన చిత్రాల ద్వారా ప్రతిభావంతులకు పట్టం కట్టడమూ మొదలు పెట్టారు. ఎంతోమంది దర్శకులను, కళాకారులను తన సినిమాల ద్వారా చిత్రసీమకు పరిచయం చేశారు. వారందరూ సినిమా రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఈ నాటికీ రామానాయుడు పేరు తలచుకుంటూనే ఉన్నారు.
చిత్రసీమ అంటే ప్రాణం పెట్టే రామానాయుడు, తాను సంపాదించినదంతా మళ్ళీ సినిమా రంగంలోనే పెట్టుబడి పెట్టారు. నిర్మాణంలో సాగుతూనే స్టూడియోను నిర్మించారు. పంపిణీ సంస్థను, పబ్లిసిటీ కంపెనీని నెలకొల్పి, సినిమారంగానికి చేతనైన సేవలు అందించారు. శతాధిక చిత్రాల నిర్మాతగా ప్రపంచ రికార్డు నెలకొల్పడమే కాదు, తన సంస్థల ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించారు నాయుడు.
రాజకీయాల్లోనూ రాణించారు రామానాయుడు. బాపట్ల పార్లమెంట్ నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. జనానికి చేతనైన సాయం చేశారు. వృద్ధాశ్రమం నిర్మించారు. ఇలా ఎంతోమంది మదిలో చెరిగిపోని స్థానం సంపాదించిన రామానాయుడు 2015 ఫిబ్రవరి 18న కన్నుమూశారు. అయినా ఆయనను మరచిపోయిన వారు లేరు. ఇప్పటికీ కొత్తగా చిత్రసీమలో ప్రవేశించే నిర్మాతలు ముందుగా రామానాయుడునే తలచుకుంటున్నారు. అదీ ఆయన సాధించిన ఘనత!
రామానాయుడు వంటి కీర్తి శిఖరాన్ని ఎవరూ మరచిపోలేరు. భావితరాలు సైతం ఆ శిఖరం నుండి స్ఫూర్తి చెందుతూనే ఉంటాయి. అది సత్యం… రామానాయుడు కీర్తి వెలుగును నిత్యం!!