Ram Gopal Varma: రాయలసీమ పగ, ప్రతీకారాల నేపథ్యంలో ‘రక్త చరిత్ర’ను రెండు భాగాలుగా తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్‌లో రెండు సినిమాలు తీయబోతున్నారు. అయితే.. కొనసాగింపుగా ఉండే ఈ సినిమాలకు రెండు పేర్లను పెట్టారు వర్మ. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను వర్మ కలిసుకున్నారని, ఆ తర్వాత జగన్ బయోగ్రఫీని వర్మ తెరకెక్కిస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. వాటిని ఖండిస్తూ, తాను తీయబోతోంది బయోపిక్ కాదని, దాన్ని మించిన రియల్ పిక్ అని వర్మ చెబుతున్నాడు. బయోపిక్ లో అయినా అబద్ధాలు ఉండొచ్చు కానీ తాను తీసే రియల్ పిక్ లో నూటికి నూరుపాళ్ళు నిజం ఉంటుందని అంటున్నాడు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ‘వ్యూహం’ కథ రూపుదిద్దుకుందని, ఇది రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని వర్మ అన్నాడు. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికారమే ‘వ్యూహం’ చిత్రం అని వర్మ తెలిపాడు. దీనికి కొనసాగింపుగా ‘శపథం’ అనే మరో సినిమా కూడా తీస్తున్నానని, ‘వ్యూహం’ షాక్ నుండి జనం తేరుకునే లోపే మరో ఎలక్ట్రిక్ షాక్ మాదిరి ‘శపథం’ను విడుదల చేస్తామని చెప్పాడు.
Read Also: Gudivada Amarnath : రెచ్చగొట్టేలా ఏ పనీ చేయద్దని మేం అంటున్నాం
ఇది అందరూ అనుకుంటున్నట్టు ఎలక్షన్స్ ను టార్గెట్ చేసి తీస్తున్న సినిమా కదాని వర్మ స్పష్టం చేశాడు. తాను అలా అన్నా… ఎవరూ నమ్మరు కాబట్టి ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం తనకు లేదని తనదైన తరహాలో ప్రకటించాడు. గతంలో వర్మ తో ‘వంగవీటి’ సినిమాను తీసిన దాసరి కిరణ్ ‘వ్యూహం’, ‘శపథం’ చిత్రాలను నిర్మించబోతున్నారు. ఇందులో తొలి భాగం వై. యస్. రాజశేఖర్ రెడ్డి రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుంటుండగా, రెండో భాగం ‘శపథం’లో ఆయన మరణానంతరం జగన్ ఎలా ముఖ్యమంత్రి అయ్యిండనేది ప్రధానాంశమని తెలుస్తోంది.