వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు దెబ్బ మీద తగులుతుంది. మొన్నటికి మొన్న తన సినిమా ‘మా ఇష్టం’ సినిమా రిలీజ్ కు రెండు రోజులు ఉంది అనగా నిర్మాత నట్టికుమార్ సినిమా ఆపివేయాలని స్టే తెచ్చిన విషయం విదితమే. తనవద్ద డబ్భులు తీసుకొని ఆ డబ్బులు ఇంకా తిరిగి ఇవ్వలేదని, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేవరకు ‘మా ఇష్టం’ సినిమా రిలీజ్ ను ఆపివేయాలని తెలుపుతూ కోర్టులో పిటిషన్ వేయగా.. కోర్టు స్టే విధించింది. ఇక వర్మ మాట్లాడుతూ మా సినిమా ఆగింది ఈ కారణం వలన కాదని, నట్టికుమార్ వ్యాఖ్యలను , ఆరోపణలను పట్టించుకొనే సమయం లేదని తేల్చి చెప్పి మే 6 న తమ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించాడు.
ఇక దీంతో ఈ వివాదం ముగిసిందని ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశాడు వర్మ. అయితే నేను ఇంకా ఉన్నాను అన్న చందాన మరోసారి నట్టికుమార్ ఎంట్రీ ఇచ్చాడు. మే 6 న కూడా ఈ సినిమాను రిలీజ్ చేయకూడదని తెలుపుతూ మరో స్టే తీసుకొచ్చాడు. ఇక దీంతో మరోసారి వర్మకు గట్టి దెబ్బ తగిలింది. నట్టికుమార్ కొడుకు నట్టిక్రాంతి కి మొత్తం డబ్బు చెల్లించిన తరువాతనే సినిమాను రిలీజ్ చేయాలనీ, అప్పటివరకు ఈ సినిమాను థియేటర్లో కానీ, ఓటిటీలో కానీ రిలీజ్ చేయడానికి వీల్లేదని కోర్టు తీర్పునిచ్చింది. మరి ఈ విషయమై వర్మ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.