రాంగోపాల్ వర్మ, బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తో గతంలో అనేక చిత్రాలు రూపొందించారు. ‘సర్కార్, సర్కార్ రాజ్, సర్కార్ 3’తో పాటుగా ‘ఆగ్, నిశ్శబ్ద్, రన్, డిపార్ట్ మెంట్’ చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు కూడా తాను హిందీ చిత్రాలు తీస్తున్నానని, వచ్చే నెలలో రాబోతున్న ‘లడకీ’ చిత్రాన్ని హిందీలోనే తీశానని వర్మ చెప్పారు. అలానే అమితాబ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నానని, నవంబర్ లో షూటింగ్ మొదలయ్యే ఆ సినిమా హారర్ జానర్ లో ఉంటుందని వర్మ తెలిపారు.
తెరపై ‘కొండా’ దంపతుల పదేళ్ళ జీవితం!
వర్మ రూపొందించిన ‘కొండా’ సినిమా ఈ నెల 23న జనం ముందుకు రాబోతోంది. వరంగల్ కు చెందిన కొండా మురళీ, సురేఖ దంపతుల జీవితంలోని ముఖ్య ఘట్టాలను వర్మ ‘కొండా’ సినిమాగా తెరకెక్కించారు. దీనికి వారి కుమార్తె సుస్మిత నిర్మాత. ఈ మూవీ గురించి వర్మ మాట్లాడుతూ, ”విజయవాడలో చదువుకోవడం వల్ల రౌడీయిజం మీద కొంత అవగాహన ఉంది. ‘రక్త చరిత్ర’ తీసినప్పుడు రాయలసీమ గురించి తెలిసింది. నేను ఎప్పుడూ తెలంగాణను పట్టించుకోలేదు. రిటైర్డ్ పోలీస్ ఒకరిని కలిసినప్పుడు మాటల మధ్యలో కొండా మురళి గురించి చెప్పారు. ఎన్నికల సమయంలో సురేఖ గారి ఇంటర్వ్యూలు చూశా. ఆమె గుర్తు ఉన్నారు. కానీ, కొండా మురళి పేరు గుర్తు లేదు. పోలీస్ చెప్పిన తర్వాత మాజీ నక్సలైట్లతో మాట్లాడాను. కొండా దంపతుల జీవితంలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. డ్రామా ఉంది. కథ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కొండా ఫ్యామిలీని కలిశా. అందరినీ కూర్చోబెట్టి ఇలా అనుకుంటున్నాని చెప్పా. తమ జీవితానికి దగ్గరగా ఉందని అనుకున్నారు. ‘మీకు అభ్యంతరం లేకపోతే ప్రొడ్యూస్ చేస్తా’ అని సుస్మిత అన్నారు. అలా ‘కొండా’ సినిమా రూపుదిద్దుకుంది” అని చెప్పారు. ఈ సినిమాలో కొండా మురళి, సురేఖ కాలేజీ జీవితం, రాజకీయ రంగ ప్రవేశం వరకూ ఉంటుందని, అంటే1990 నుంచి 2000 వరకూ అనుకోవచ్చని వర్మ అన్నారు. కొండా పాత్రకు త్రిగుణ్ బాగుంటాడని అతన్ని ఎంపిక చేసుకున్నానని, అలానే గద్దర్ తో కలిసి ఈ సినిమా కోసం ఓ పాట పాడానని వర్మ తెలిపారు.