మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ లోని స్టార్ హీరోల్లో ఒకరన్న విషయం తెలిసిందే. మెగా వారసుడికి లెక్కలేనంతమంది మెగా అభిమానులు తోడుగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఇప్పుడు పాన్ ఇండియా రేసులోనూ తన ప్లేస్ ను సుస్థిరం చేసుకోవడానికి ‘ఆర్ఆర్ఆర్’తో ముందడుగు వేశారు చెర్రీ. ఈ సినిమా మాత్రమే కాకుండా రామ్ చరణ్ నటించనున్న తరువాత రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఈ నేపథ్యంలో చెర్రీ తన రెమ్యూనిరేషన్ ను భారీగా పెంచేశాడు అంటూ నేషనల్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. రామ్ చరణ్ ఇప్పుడు 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడని, తన తదుపరి రెండు చిత్రాలైన #RC15, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం చెర్రీ 100 కోట్లు వసూలు చేస్తున్నాడని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఆ రూమర్స్ నిజం కాదని చరణ్ స్వయంగా పేర్కొన్నారు.
Read Also : జక్కన్న ఏంటీ సైలెన్స్… ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు ప్రీ రిలీజ్ సంగతేంటి?
ఓ ఇంటర్వ్యూలో 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట కదా ? అనే ప్రశ్న చరణ్ కు ఎదురైంది. ఆ ప్రశ్నకు సమాధానంగా చరణ్ మాట్లాడుతూ అవన్నీ నిరాధారమైన రూమర్స్ అని అన్నారు. “ఈ 100 కోట్లు ఎక్కడివి ? ఎవరు ఇస్తున్నారు నాకు ? ముందుగా ఆ 100 కోట్లు ఎక్కడున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాను” అని చరణ్ నవ్వుతూ చెప్పాడు. కాబట్టి ఇది కేవలం పుకారు మాత్రమే అని నిర్ధారణ అయ్యింది. కాగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ కనిపించనున్నాడు. ఈ చిత్రం జనవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళం, హిందీ మరియు మలయాళ భాషల్లో సినిమాను ప్రమోట్ చేస్తూ ముగ్గురూ దేశమంతటా పర్యటిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ‘జంజీర్’తో బాలీవుడ్ లో ప్రయత్నం చేసి విఫలమైన తర్వాత రామ్ చరణ్ చేస్తున్న మరో బాలీవుడ్ చిత్రమిది.