స్సెషల్ మూవీ షూటింగ్స్ లో మరిన్ని స్పెషల్స్ చోటు చేసుకుంటేనే మజా! రామ్ చరణ్ నటిస్తోన్న 15వ సినిమా నిస్సందేహంగా ఆయనకు ఓ స్పెషల్ అనే చెప్పాలి. తొలిసారి డైనమిక్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రమిది. ఇక ఈ సినిమాను నిర్మిస్తోన్న దిల్ రాజు కు ఇది 50వ సినిమా కావడం మరింత విశేషం! ఈ విశేషాల నేపథ్యంలో రామ్ చరణ్ మరో స్పెషల్ ను చొప్పించారు. అదేమిటంటే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమృత్ సర్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడ బిఎస్ఎఫ్ జవాన్లతో కలిసే ఛాన్స్ చిక్కింది చెర్రీకి. దాంతో వారితో కొంత సమయం గడపాలన్న ఆలోచన చెర్రీకి కలిగింది. అంతటితో ఆగితే అతను రామ్ చరణ్ ఎందుకు అవుతారు? ఎప్పుడూ ఒకే తరహా భోజనం చేసే ఆ వీరజవాన్లకు తన ఇంటివంట రుచి చూపించాలనుకున్నారు చెర్రీ. వెంటనే హైదరాబాద్ నుండి తనకు వంట చేసే షెఫ్ ను పిలిపించారు. బీఎస్ఎఫ్ వీరజవాన్లకు తన ఇంటి వంట రుచి చూపించారు.

Ram Charan2
చెర్రీ చేసిన పని ఆయనకు సంతృప్తి కలిగించి ఉండవచ్చు. కానీ, అందులోనూ ఓ పరమార్థం కనిపిస్తోంది. నిత్యం మన రక్షణ కోసం పాటు పడే వీరజవానుల కోసం చెర్రీలాగే మరికొందరు తపించేందుకు ఇది స్ఫూర్తి కాగలదని చెప్పవచ్చు. ఏది ఏమైనా శంకర్ సినిమా కోసం చెర్రీ ఎంతో హుషారుగా పనిచేస్తున్నారు. ఆ ఉత్సాహంతోనే బీఎస్ఎఫ్ సైనికులతో కలసి కాసేపు గడిపారు. సినిమాలోనూ ఈ ఉత్సాహం కనిపించి, అభిమానులకు ఈ సినిమా మరింత హుషారు కలిగిస్తుందేమో చూడాలి.