Star Hero’s Remuneration in tollywood: టాలీవుడ్‌లో ప్రస్తుతం సంక్షోభం నెలకొంది. సినిమాల బడ్జెట్లు పెరిగిపోవడంతో ఏం చేయాలో అర్ధం కాక ఆగస్టు 1 నుంచి షూటింగులు నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో సెట్స్‌పై ఉన్న సినిమా షూటింగులన్నీ ఆగిపోయే పరిస్థితి ఉండటంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాడు. ఆయన పలువురు స్టార్ హీరోలతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం అందుతోంది. టాలీవుడ్‌లో షూటింగుల బంద్‌పై అగ్రహీరోలతో దిల్ రాజు సమావేశం జరపగా పలువురు హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు అంగీకారం తెలిపారు. వీరిలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ ఉన్నారు. వీళ్లంతా వచ్చే సినిమాల నుంచి తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటామని దిల్ రాజుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగతా హీరోలతో ఈ అంశంపై చర్చిస్తామని నిర్మాతలు చెప్తున్నారు. మరి మిగిలిన హీరోలందరూ ఎన్టీఆర్, రామ్‌చరణ్, బన్నీ బాటలో నడుస్తారో లేదో వేచి చూడాలి.
Read Also: Highest Salary in India: అమ్మో.. ఆయన శాలరీ ఏడాదికి రూ.123 కోట్లా?
అటు ఇప్పటికే ఓటీటీలలో సినిమాల విడుదల విషయంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద సినిమాలను 10 వారాల తర్వాత, చిన్న సినిమాలు నాలుగు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయంపై కూడా అగ్ర హీరోలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కార్మికుల వేతనాలపై కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా టాలీవుడ్‌లో షూటింగుల బంద్‌పై నిర్మాతల మండలికి మెగాస్టార్ చిరంజీవి లేఖ రాశారు. దీనిపై అందరూ చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం మరోసారి కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో నిర్మాతలందరి అభిప్రాయాలను తీసుకుని షూటింగుల బంద్‌పై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.