Rajinikanth: నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ వేడుకలకు టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు భారీ ఎత్తులో తరలివచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, చంద్రబబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ .. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా బాలకృష్ణ గురించి, తెలుగు ప్రేక్షకుల గురించి తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచారు.”తెలుగు మాట్లాడి చాలా రోజులైంది. తెలుగులో ఏమైనా తప్పులుంటే క్షమించాలి.ఈ సభలో జనాన్ని చూస్తుంటే రాజకీయం మాట్లాడాలని అనిపిస్తోంది. కానీ అనుభవం వద్దురా రజనీ రాజకీయం మాట్లాడొద్దంటోంది. కానీ ఎన్టీఆర్ గురించి రాజకీయం మాట్లాడక తప్పడం లేదు. ఎన్టీఆర్ నటించిన సినిమాలు అమోఘం. ఎన్టీఆర్ తో టైగర్ సినిమా చేశాను. ఎన్టీఆర్ నన్నెంతో ప్రభావితం చేశారు.. నేను చూసిన మొదటి సినిమా పాతాళభైరవి.. అప్పుడు నాకు ఆరేళ్లు ఉంటాయి.. నేను హీరోగా చేసిన తొలి సినిమా పేరు భైరవి. యాదృచ్చికమైన నాకు అది ఎంతో ఆనందాన్ని కలుగజేసింది.
13 ఏళ్లప్పుడు లవకుశ సినిమా సమయంలో ఎన్టీఆర్‌ను చూశాను.. ఓసారి ఎన్టీఆర్ వచ్చినప్పుడు చూడడానికి వెళ్తే ఎవరో నన్ను ఎత్తుకుని ఆయన్ని చూపించారు.. 18 ఏళ్లప్పుడు స్టేజ్‌పై ఎన్టీఆర్‌ను ఇమిటేట్ చేశా.. ఆ తర్వాత 1977లో ఆ మహానుభావుడితోనే కలిసి టైగర్ సినిమా చేశాను.టైగర్ సినిమా నుంచి ఓ సందర్భంలో నన్ను తప్పించే ప్రయత్నం చేశారు.. కానీ ఎన్టీఆరే ససేమిరా అన్నారు. రజనీకాంత్ అంటే స్పీడ్.. స్పీడ్ అంటే రజనీకాంత్. కానీ నాకంటే ఎన్టీఆర్ నాకంటే స్పీడ్. రాజమండ్రిలో షూటింగుకు వస్తే.. దానవీర శూర కర్ణ సినిమాకు వచ్చిన జనం మధ్యలో ట్రాఫిక్ జాంలో చిక్కుకున్నాను. అదే అందుకు ఉదాహరణ. ఇక దానవీర శూర కర్ణ సినిమాలో నేను ధుర్యోధన క్యారెక్టర్ చేయాలనుకున్నా.. కానీ నాకు మేకప్ వేస్తే బాగుండలేదన్నారు. అందుకే నేను ఆ క్యారెక్టర్ చేయలేదు.. వదిలేశాను. దానవీర శూరకర్ణ ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు.. ఎన్టీఆర్‌ది ఎంతో గొప్ప వ్యక్తిత్వం.. అప్పట్లో దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ సంచలనం సృష్టించారు.. మహామహులను ధీటుగా ఎదుర్కొన్నారు ఆయన మహా కోపిష్ఠుడు.. కానీ మంచి మనసు. అదే క్వాలిటీ బాలకృష్ణకు వచ్చింది. బాలకృష్ణ నా మిత్రుడు, కంటిచూపుతోనే చంపేస్తాడు.. బాలయ్య ఒక తన్ను తంతే జీపు ఎగిరి పడుతుంది..అది బాలయ్య చేస్తేనే జనాలు చూస్తారు. బాలకృష్ణ చేసే ఫీట్లు అమీర్‌ఖాన్, సల్మాన్, అమితాబ్, నేను చేసినా జనం ఒప్పుకోరు. అది కేవలం బాలకృష్ణ వలన మాత్రమే అవుతుంది. బాలయ్యలో జనాలు ఎన్టీఆర్ ను చూస్తున్నారు. ఆయన ఏం చేసినా జనం చూస్తారు. బాలయ్యకు కోపం ఎక్కువ.. కానీ మనస్సు వెన్న.
ఇక నాకు చంద్రబాబును మోహన్ బాబు పరిచయం చేశారు. చంద్రబాబు నాకు 30 ఏళ్లుగా మిత్రుడు.. చంద్రబాబు ఐటీ విజన్ ఏంటో ప్రపంచానికి తెలుసు. గొప్ప రాజకీయ నాయకుడు అవుతాడని అప్పుడే అనుకున్నాను. చంద్రబాబు పెద్ద విజనరీ.. చంద్రబాబు విలువ ఇక్కడ ఉన్నవాళ్లకంటే…బయట ఉన్న వాళ్లకే తెలుసు. ఎప్పుడూ అభివృద్ధి గురించే చంద్రబాబు మాట్లాడేవారు. హైదరాబాదులో సైబరాబాద్ సైడ్ వెళ్లాను.. హైదరాబాద్‌కు వస్తే ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానో అర్థం కాలేదు. హైదరబాద్ అభివృద్ధి అవ్వడంతో చంద్రబాబు పాత్ర ఎంతో ఉంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. చంద్రబాబు విజన్ 2047 సాకారం అవుతుంది” అంటూ ముగించారు.