మరో వారం రోజులకు జనం ముందు నిలవనుంది రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ఆర్.ఆర్.ఆర్.’ కొన్ని దశాబ్దాల తరువాత తెలుగునాట వస్తోన్న అసలు సిసలు మల్టీస్టారర్ గా ‘ట్రిపుల్ ఆర్’ను కీర్తిస్తున్నారు. మాస్ లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న జూ.యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా ఈ నెల 25న సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో ‘ట్రిపుల్ ఆర్’ మూవీ బడ్జెట్ ఎంత అన్న దానిపైనా సినీఫ్యాన్స్ లో విశేషంగా చర్చ సాగుతోంది. మూడువందల కోట్లు అని కొందరు, కాదు నాలుగు వందల కోట్లని మరికొందరు, ఐదు వందల కోట్లు దాటిందని ఇంకొందరు ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. అయితే ‘ట్రిపుల్ ఆర్’ బడ్జెట్ అక్షరాలా మూడువందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అయిందట! ఈ మాట చెప్పిందెవరో కాదు ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని. ఈ మొత్తంలో సినిమాలో నటించిన యన్టీఆర్, రామ్‌చరణ్, అలియా భట్, దర్శకుడు రాజమౌళి పారితోషికాలు కలుపలేదట! అదీగాక జియస్టీ లేకుండానే రూ.336 కోట్లట!
ఇటీవల ‘ట్రిపుల్ ఆర్’ చిత్ర దర్శకుడు రాజమౌళి, నిర్మాత డి.వి.వి. దానయ్య ఏపీ సీఎమ్ జగన్మోహన రెడ్డిని ఈ చిత్రం బడ్జెట్ విషయమై కలిసి, ప్రస్తావించారు. ఆయన అందుకు సానుకూలంగా స్పందించి, ఆ సినిమా బడ్జెట్ ఎంత? దానికి అనుగుణంగా ఆ చిత్రానికి టిక్కెట్ రేటు ఎంత పెంచాలి అన్న అంశాలపై ఆలోచించి నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రికి, మంత్రి నానికి తమ సినిమా బడ్జెట్ వివరాలు తెలిపారు రాజమౌళి, దానయ్య. అందువల్ల నానికి అంత పక్కాగా ‘ట్రిపుల్ ఆర్’ నిర్మాణ వ్యయం ఎంతనో తెలిసి పోయింది. దాంతో ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అమలులో ఉన్న టిక్కెట్ రేట్లకు అదనంగా రూ.100 పెంచుకోవచ్చునని తేల్చింది. బాగానే ఉంది. మరి ఈ సినిమాలో నటించినందుకు తారక్, చెర్రీ, అలియా ఎంత పుచ్చుకున్నారు.
దర్శకత్వం వహించినందుకు రాజమౌళి పారితోషికం ఎంత అన్న అంశాలపైనా చర్చ సాగుతోంది. మళ్ళీ ఎవరికి వారు తమకు తోచిన లెక్కలు చెబుతున్నారు. నాని తెలిపారని చెబుతున్న రూ.336 కోట్లకు అదనంగా మరో రెండు వందల కోట్లు కలపాలని కొందరి మాట! మరికొందరు మూడువందలు కలుపుకోక తప్పదని అంటున్నారు. ఇలా లెక్కలు సాగుతున్న ‘ట్రిపుల్ ఆర్’ విడుదలయ్యాక ఎంత వసూలు చేస్తుంది అన్న దానిపైనా ముచ్చట్లు సాగుతున్నాయి. మరి అసలు ఎంత, రాబడి ఎంత అన్న విషయాలు ‘ట్రిపుల్ ఆర్’ జనం ముందు నిలిచాక, ఆపై వసూళ్ళు కురిశాకే తెలుస్తాయి.