దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ట్రిపుల్ ఆర్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోను సంచలనాలు సృష్టించింది. వసూళ్ల పరంగా రికార్డుల మోత మోగించింది. వెయ్యి కోట్లకు మించి వసూళ్లని రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ రిలీజై నెల రోజులు దాటడంతో బాక్సాఫీస్ దగ్గర సందడి తగ్గింది. దాంతో ఇక రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ టైం స్టార్ట్ అయింది. అసలు ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఫిక్స్ అయిందని తెలిసిందో.. అప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్, తారక్‌లతో కలిసి సంచలన విజయాన్ని అందుకున్న జక్కన్న.. మహేష్‌ను ఏ రేంజ్ లో ప్రజెంట్ చేస్తాడా.. అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రాకుండానే మోస్ట్ అవైటేడ్‌గా మారిపోయింది. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించి కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో వినిపిస్తునే ఉన్నాయి.
ఈ క్రేజీ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది.. ఎలాంటి కథతో రాబోతున్నారనే.. చర్చ జరుగుతునే ఉంది. ఇప్పటికే రాజమౌళి రెండు స్టోరీ లైన్లు రెడీ చేసినట్టు వినిపించగా.. ఇప్పుడు వాటిలో ఒకటి ఫైనల్ అయినట్టు వినిపిస్తోంది. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న జక్కన్న.. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్‌ని పూర్తి చేసి.. ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయబోతున్నారట. దాదాపు ఐదు నుంచి ఆరు నెలల వరకు స్క్రిప్ట్ మీదే పనిచేయబోతున్నారట. ఆ తర్వాత వెంటనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని టాక్. అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లోనే ఈ ప్రాజెక్ట్ పెట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ లోపు మహేష్ బాబు.. త్రివిక్రమ్ సినిమాను ఫినిష్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు ఐదు నెలల వ్యవధిలోనే ఈ సినిమాకు గుమ్మడి కాయ కొట్టేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ నటించిన ‘సర్కారు వారి పాట’ మే 12న రిలీజ్ కాబోతోంది. ఆ తరువాత వెంటనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నారు. ఇది పూర్తయిన తరువాత.. రాజమౌళి సినిమా మొదలు కాబోతోంది. ఏదేమైనా రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ ఎలాంటి స్టోరీ లైన్‌తో రాబోతుందో చూడాలి.