సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఓ సినిమా చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాత్కాలికంగా #SSMB29 పేరుతో పిలుచుకుంటున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. అయితే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ కోసం మల్టీస్టారర్ కాన్సెప్ట్‌ను సిద్ధం చేశాడని ఊహాగానాలు వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఓ అగ్ర నటుడు కీలక పాత్ర పోషించనున్నారని, సినిమాలో మరో ప్రధాన నటుడి ఎపిసోడ్ 40 నిమిషాల పాటు సాగుతుందని అన్నారు. పాన్ ఇండియన్ అప్పీల్ పొందడానికి రాజమౌళి ఈ సినిమా కోసం ఒక టాప్ బాలీవుడ్ నటుడిని ఎంపిక చేసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. ఈ చిత్రం మల్టీ స్టారర్ అయినప్పటికీ, సినిమాలో ఇద్దరు ప్రధాన నటీనటులకు కలిపి ఎపిసోడ్‌లు ఉండవని అన్నారు. అయితే తాజాగా రాజమౌళి ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు.
Read Also : RRR Pre Release Event : చిక్కబళ్లాపూర్ లోనే ఎందుకు ?
తాజాగా బెంగుళూరులో జరిగిన RRR సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడుతూ SSMB29 మల్టీ స్టారర్ కాదని, ఇందులో ఒకే హీరో ఉంటాడని అన్నారు. ఇక మహేష్ బాబు, రాజమౌళి ఇద్దరూ వాళ్ళ చేతిలో ఉన్న ఇతర ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాకనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నాడు. తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో #SSMB28ని చేయబోతున్నాడు. మరోవైపు రాజమౌళి “ఆర్ఆర్ఆర్” మార్చ్ 25న విడుదలకు సిద్ధంగా ఉండడంతో ప్రమోషనల్ కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు.