(ఫిబ్రవరి 17న ‘రైతు కుటుంబం’కు 50 ఏళ్ళు)
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా పలు రైతు నేపథ్యగాథలు తెరకెక్కాయి. వాటిలో అనేకం విజయపథంలో పయనించాయి. ఏయన్నార్ నటించిన ‘రైతు కుటుంబం’ సైతం జనాన్ని విశేషంగా అలరించింది. 1972 ఫిబ్రవరి 17న ‘రైతుకుటుంబం’ విడుదలైంది.
‘రైతు కుటుంబం’ టైటిల్ లోనే కథ తెలిసిపోతోంది. ఓ రైతు పెద్ద కొడుకు జోగయ్య ఇల్లు పట్టించుకోకుండా పేకాట ఆడుతూ జల్సాగా తిరుగుతూ ఉంటాడు. జోగయ్య భార్య అన్నపూర్ణ తన కూతురుతో పాటు మరదులు రాము, మధును కన్నబిడ్డల్లా చూసుకుంటుంది. రైతు చనిపోవడంతో ఆమెనే పొలం పనులు చేస్తూ ఇంటిని పోషిస్తుంది. వదిన కష్టం చూడలేక రాము చదువు మానేసి, తమ్ముడిని చదివిస్తాడు. అతను పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఊరిలో ఉండే పెద కామందు పానకాలు కూతురు రాధ రామును ప్రేమిస్తుంది. కానీ, రాము తమ్ముడు మధుకు తన కూతురును ఇవ్వాలని ఆశిస్తాడు పానకాలు. అయితే మధు, పట్నంలో షావుకారు కూతురు గీతను పెళ్ళాడతాడు. ఆమె రాము వాళ్ళను దూరం పెడుతుంది. మధుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాము నిరాశచెందుతాడు. అయినా, ఆస్తి మొత్తం అమ్మేసి తన అన్న కూతురు లక్ష్మి పెళ్ళి జరిపిస్తాడు. లక్ష్మి భర్త లోకేశ్వరరావు మంచివాడు. కానీ, ఆమె అత్త భూలోకం గయ్యాళి. అయితే లోకేశ్ ఓ నాటకం ఆడి తల్లిని దారికి తెస్తాడు. ఆస్తి మొత్తం పోగొట్టుకున్న రాము, తన కుటుంబంతో పట్నం చేరతాడు. లోకేశ్ కారణంగా టాక్సీ డ్రైవర్ అవుతాడు. రామును పెళ్ళాడాలని భీష్మించుకుంటుంది రాధ. ఎలాగైనా రామును చంపాలని చూస్తాడు పానకాలు. డబ్బుకు ఏ పనియైనా చేసే స్థితికి దిగజారిన జోగయ్య, పానకాలు మాట విని రామును చంపాలని చూస్తాడు. అయితే తన అన్ననే తనను చంపాలని వచ్చాడని తెలుసుకుంటాడు రాము. తమ్ముని మంచి తనం చూసి జోగయ్య మారిపోతాడు. పానకాలుకు బుద్ధి చెబుతాడు రాము. చివరకు రాము, రాధ పెళ్ళితో కథ సుఖాంతమవుతుంది.
కాంచన కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అంజలీదేవి, రామకృష్ణ, గీతాంజలి, సత్యనారాయణ, చిత్తూరు నాగయ్య, దూళిపాల, పద్మనాభం, సాక్షి రంగారావు, జి.వి.సుబ్బారావు, సూర్యకాంతం, విజయలలిత, అనిత, మాస్టర్ ఆదినారాయణ రావు ఇతర ముఖ్యపాత్రధారులు. కృష్ణంరాజు అతిథి పాత్రలో కనిపించారు.
నవభారత్ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి పి.వి. సుబ్బారావు కథను అందించగా, గొల్లపూడి మాటలు రాశారు. చలపతిరావు సంగీతం సమకూర్చగా, సి.నారాయణరెడ్డి, దాశరథి, కొసరాజు పాటలు పలికించారు. పి.వి.సుబ్బారావు, పి.యస్.ప్రకాశరావు నిర్మించిన ఈ చిత్రానికి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. సినారె రాసిన “ఈ మట్టిలోనే పుట్టాము… ఈ మట్టిలోనే పెరిగాము…”, “ఊరంతా అనుకుంటున్నారు…”, “జిల్లాయిలే జిల్లాయిలే…”, “ఎక్కడికని పోతున్నావు…” వంటి పాటలు అలరించాయి. దాశరథి పలికించిన “అమ్మా…చల్లని మా అమ్మా…”, “మనసే పొంగెను ఈ వేళ…” పాటలూ ఆకట్టుకున్నాయి. కొసరాజు “వద్దన్నా వదలుదులే…” అనే పాట రాశారు.
‘రైతుకుటుంబం’ చిత్రం మంచి విజయం సాధించింది. వ్యవసాయం సాగించే ఉమ్మడి కుటుంబాల కథ నేపథ్యంలో సినిమాలు రూపొందడం కొత్తేమీ కాదు. ఉన్న ఊరిలో అన్నీ కోల్పోతే పట్నానికి వెళ్ళి సంపాదించుకోవడం అన్నది ఎప్పుడూ ఉండేదే. ఈ చిత్రంలో కథానాయకుడు పట్నం వెళ్ళి తన కుటుంబాన్ని ఎలా పోషించుకున్నాడు, తన వారిలో ఎలా మార్పు తెచ్చాడు అన్నది ముఖ్యాంశం. ఇదే ఆ రోజుల్లో జనాన్ని భలేగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఈ చిత్రం విడుదలైన ముందు సంవత్సరంలో అంటే 1971లో ఏయన్నార్ నటించిన పల్లెసీమ నేపథ్యంలో తెరకెక్కిన ‘దసరాబుల్లోడు’ అనూహ్య విజయం సాధించింది. ఆ ఊపులోనే ‘రైతు కుటుంబం’ కూడా జనాదరణ చూరగొంది.