Raghava Lawrence Rudrudu Movie Postponed To April: యాక్టర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ కధానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’. ఈ సినిమాను ఈ యేడాది డిసెంబర్ 23న విడుదల చేస్తామని దర్శక నిర్మాత కతిరేసన్ గతంలో తెలిపారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను వచ్చే ఏప్రిల్ 14కు వాయిదా వేశారు. అయితే అదే రోజున చిరంజీవి ‘భోళా శంకర్’ కూడా విడుదల కానుంది.
‘రుద్రుడు’ గురించి దర్శక నిర్మాత కతిరేసన్ మాట్లాడుతూ, ”మా బ్యానర్ నుండి ‘పొల్లాధవన్, ఆడుకాలం, జిగర్తాండ, డైరీ’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత వస్తున్న సినిమా ‘రుద్రుడు’. రాఘవ లారెన్స్ ‘కాంచన-3’ విడుదలై దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. సో… ఈ చిత్రంతో అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి మా వంతు కృషి చేస్తున్నాం. ‘రుద్రుడు’ను ముందుగా క్రిస్మస్ కు విడుదల చేయాలని అనుకున్నాం. కానీ వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తి కావడానికి మరికొన్ని నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది. కాబట్టి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నాం” అని అన్నారు. శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ‘రుద్రుడు’కు ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.