Radhika: ‘పలాస 1978’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు హీరో రక్షిత్ అట్లూరి. అతని తాజా చిత్రమే ‘ఆపరేషన్ రావణ్’. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాలో అలనాటి కథానాయిక రాధిక ఓ కీలక పాత్ర పోషించారు. ఆవిడ క్యారెక్టర్ లుక్ పోస్టర్ ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ, “ఇందులో నేను జీవిత అనే పాత్రను పోషించాను. గతంలో నేను నటించిన ‘స్వాతి ముత్యం, స్వాతి కిరణం’ లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలు ఈ సినిమాలోని ఈ పాత్ర చేస్తుంటే గుర్తొచ్చాయి. దర్శకుడు వెంకట సత్య చెప్పిన ‘ఆపరేషన్ రావణ్’ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. నాది ఎంతో హృద్యమైన పాత్ర” అని అన్నారు. దర్శకుడి గురించి మాట్లాడుతూ ‘తొలి చిత్రం అయినప్పటికీ వెంకట సత్య తన పాత్రని మలిచిన తీరు, చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం ఎంతగానో ఆకట్టుకుందని, తెలుగుతో పాటు ఏక కాలంలో తమిళంలో విడుదలవుతున్న ఈ చిత్రంలో పని చేయడం చాలా సంతోషంగా ఉంద’ని అన్నారు. సుధాస్ మీడియా బ్యానర్ మీద ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ న్యూ ఏజ్ యాక్షన్-సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆపరేషన్ రావణ్’లో రక్షిత్ అట్లూరి సరసన సంకీర్తన విపిన్ హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.