Radhika Apte: అప్పుడు ఓడ మల్లన్న.. ఇప్పుడు బోడి మల్లన్న

Radhika Apte

Radhika Apte

నటనలో వైవిధ్యం, బోల్డ్ క్యారెక్టర్లతో గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే మరోసారి సౌత్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చకు తెరతీశారు. గతంలో టాలీవుడ్‌లో పనిచేసిన అనుభవాలను తవ్వుకుంటూ ఆమె చేసిన తాజా కామెంట్లు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కెరీర్ తొలినాళ్లలో భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుని, స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు పొందిన ఈ భామ… ఇప్పుడు ఇండస్ట్రీ నిలదొక్కుకున్నాక అదే పరిశ్రమపై విషం చిమ్ముతోందంటూ సినీ ప్రేమికులు మండిపడుతున్నారు. ఇది అచ్చంగా ‘ఏరు దాటేదాకా ఓడ మల్లన్న… ఏరు దాటాక బోడి మల్లన్న’ చందంగా ఉందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

అసలు వివాదం ఏమిటి?

కీర్తి సురేష్‌తో కలిసి నటించిన ‘అక్కా’ వెబ్ సిరీస్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రాధికా ఆప్టే మాట్లాడుతూ.. “తెలుగులో ఒక సినిమాలో నాకంటే వయసులో చాలా పెద్దవాడైన నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చింది. కథలో సొంత మేనబావను పెళ్లి చేసుకునే సన్నివేశాలు పెట్టారు. అంతేకాదు, సినిమా మధ్యలోనే నా పాత్రను చంపేశారు.” ఆమె నేరుగా పేరు చెప్పనప్పటికీ, నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లెజెండ్’ (2014) గురించే ఈ మాటలన్నారని అందరికీ అర్థమైపోయింది. అందులో బాలయ్య మరదలిగా కనిపించిన ఆమె పాత్రను ఫ్లాష్‌బ్యాక్‌లోనే విలన్లు అంతం చేస్తారు.

ఈ వివాదంలో ప్రధానంగా చర్చనీయాంశమవుతున్న అంశం రాధికా ఆప్టే ప్రదర్శిస్తున్న ద్వంద్వ వైఖరి. దక్షిణాదిలో ‘మేనరికం’ అనేది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. స్థానిక నేటివిటీ ప్రకారం కథలో అలాంటి నేపథ్యం రావడం సర్వసాధారణం. అయితే ఉత్తరాది భామలకు అది అభ్యంతరకరంగా అనిపించినప్పుడు, అసలు ఆ కథను ఎందుకు ఒప్పుకున్నారన్నది ప్రధాన ప్రశ్న. కథ వినకుండా, హీరో ఎవరనేది తెలుసుకోకుండా, పారితోషికం అందుకోకుండా ఎవరైనా అగ్రిమెంట్‌పై సంతకం చేస్తారా? అంతేకాదు, ‘లెజెండ్’ సినిమాతో తెలుగులో గుర్తింపు దక్కించుకున్న తర్వాత కూడా ఆమె అదే బాలకృష్ణ సరసన మళ్లీ ‘లయన్’ చిత్రంలో నటించారు. అంతగా అసంతృప్తి ఉంటే రెండోసారి అదే హీరోతో సినిమా ఎందుకు చేశారంటూ అభిమానులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు అవకాశాలను అందిపుచ్చుకుని, పేరు, పాపులారిటీ, పారితోషికం అన్నీ తీసుకున్నాక… ఇప్పుడు పితృస్వామ్యం, వయసు వ్యత్యాసాలు అంటూ నీతులు చెప్పడం ఆమె నైజానికి అద్దం పడుతోందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

మరోవైపు సినీ విశ్లేషకుల్లో కొందరు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే పరభాషా హీరోయిన్లకు పెద్ద హీరోల చిత్రాలను తిరస్కరించేంత పరపతి, బలం ఉండవని వారు గుర్తుచేస్తున్నారు. కథ చెప్పేటప్పుడు ఒకటి చెప్పి, సెట్స్ పైకి వెళ్లాక సన్నివేశాలు మార్చడం కమర్షియల్ సినిమాల్లో జరుగుతూనే ఉంటుందని అంటున్నారు. అయినప్పటికీ, పుష్కర కాలం తర్వాత పాత విషయాలను బయటకు తీసి, ఒక ప్రాంతీయ సంస్కృతిని, పరిశ్రమను కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నదే మెజారిటీ సినీ ప్రియుల అభిప్రాయం.