ప్రముఖ నటుడు మాధవన్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ మూవీ విడుదల తేదీ ఖరారైంది. కరోనా పాండమిక్ సిట్యుయేషన్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టకేలకు జూలై 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మాధవన్ తెలిపాడు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన సైంటిస్ట్ నంబీ నారాయణన్ జీవితంలోని సంఘటనల ఆధారంగా ‘రాకెట్రీ’ చిత్రాన్ని మాధవన్ తెరకెక్కించాడు.
సిమ్రాన్ బగ్గా, రజిత్ కపూర్, రవి రాఘవేంద్ర, మిషా ఘోషల్, గుల్షన్ గ్రోవర్, కార్తీక్ కుమార్, దినేశ్ ప్రభాకర్ కీలక పాత్రలు పోషించిన ‘రాకెట్రీ’ సినిమా హిందీ వర్షెన్ లో షారుక్ ఖాన్, దక్షిణాదిలో సూర్య అతిథి పాత్రల్లో మెరిశారు. ‘ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయాలనుకున్నామని, అయితే ఇప్పుడు జూలై 1కి మార్చామ’ని తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా మాధవన్ తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ తో పాటు కొన్ని సన్నివేశాలను చూసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ మాధవన్ ను, నంబీ నారాయణను ప్రత్యేకంగా అభినందించడం విశేషం. ట్రైకలర్ ఫిలిమ్స్, వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట్వంటీ సెవెన్త్ ఇన్వెస్టెమెంట్స్ సంస్థలు ‘రాకెట్రీ’ మూవీని హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నాయి.
