Ritu Varma: టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు, రీతూవర్మ జంటగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్వాగ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు రీతూవర్మ పుట్టినరోజు కావడంతో.. ఆమెకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తూ.. ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక ఈ చిత్రంలో రీతూ.. రుక్మిణి దేవిగా కనిపించబోతుంది. మొన్న కింగ్ స్వాగ్ అంటూ శ్వాగణిక వంశానికి రాజు అయిన భవభూతి శ్వాగణిక అదేనండీ.. శ్రీవిష్ణును చూపించారు. ఇక ఇప్పుడు వింజామర వంశానికి రాణి అయిన రుక్మిణిదేవిని చూపించారు. ఇది మగవారి కథ అని శ్వాగణిక రాజు అంటే.. ఆ మగవారు.. పగవారు.. వారి అహంకారాన్ని తగ్గించడానికి వచ్చిన రాణి అంటూ రీతూ చెప్పుకుంటూ వచ్చింది.
” స్వాగ్ అసలు ఎవరి కథ అని అడగ్గా.. శ్వాగణిక రాజు.. ఇది మా కథ.. మా మగవారి కథ అని చెప్పిన వీడియోను చూస్తూ రుక్మిణి దేవి కోపంతో.. మగవాడు.. అంటేనే పగవాడు. వాడి ఉనికిని ఉండనిస్తామా.. ఆ మగవాడి వీడియోకు వ్యూస్, లైక్స్.. కోటి వరహాలు పడేస్తే మాకు వస్తాయి లైక్స్. చూస్తున్న ప్రతి మగవాడికి చెప్తున్నా.. మా వింజామర వంశ హయంలో ప్రతి మగవాడి తలను వంచుతాం.. చరిత్రలో మా కథను రచిస్తాం” అని చెప్పుకొచ్చింది. ఇక క్వీన్ గారి స్వాగ్ చూసి శ్వాగణిక రాజు గారు కాల్ చేసి.. ” రుక్మిణి దేవి.. జన్మదిన శుభాకాంక్షలు. ఆడజాతి అంతా తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే .. ఈ కథ మాది.. మగవాడి ఉనికిని నిలబెట్టిన శ్వాగణిక వంశానిది” అంటూ చెప్పుకురావడం హైలైట్ గా నిలిచింది. అసలు ఈ వంశాలు ఏంటి.. ఆడామగ కొట్టుకోవడం ఏంటి.. ? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. మరి ఈ సినిమాతో శ్రీవిష్ణు మరో హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.