గతేడాది విడుదలైన ‘పుష్ప: ద రైజ్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే! ముఖ్యంగా.. ఉత్తరాదిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. టికెట్ రేట్ల రగడ కారణంగా ఏపీలో కొద్దోగొప్పో నష్టాలు చవిచూసిందే తప్ప, ఇతర ఏరియాలన్నింటిలోనూ మంచి లాభాలే తెచ్చిపెట్టింది. దీంతో, ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప: ద రూల్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలోనే దర్శకుడు సుకుమార్.. సీక్వెల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తాను ముందుగా రాసుకున్న స్క్రిప్ట్‌లో మార్పులు చేసి, మరిన్ని హంగులు – భారీతనంతో సీక్వెల్‌ని రూపొందించాలని నిర్ణయించాడు. సుకుమార్ ఆ నిర్ణయం తీసుకోవడం వల్లే, ఫిబ్రవరిలోనే సెట్స్ మీదకి వెళ్ళాల్సిన ఈ ప్రాజెక్ట్ జాప్యమవుతూ వస్తోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సీక్వెల్‌కి ఏకంగా రూ. 400 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నారట! పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌పై విపరీతమైన క్రేజ్ నెలకొంది కాబట్టి, ఆయా ఇండస్ట్రీలలో పేరుగాంచిన నటీనటుల్ని సుకుమార్ రంగంలోకి దింపుతున్నట్టు తెలిసింది.
అటు, టెక్నికల్ సపోర్ట్ కోసం మంచి అనుభవం ఉన్న టెక్నీషీయన్స్ విదేశాల నుంచి తీసుకొస్తున్నారు. పాటల దగ్గర నుంచి ఫైట్ల దాకా.. ప్రతీదీ గ్రాండ్‌గా ఉండేలా సుకుమార్ డిజైన్ చేస్తున్నాడని తెలుస్తోంది. తొలి భాగానికి వచ్చిన అనూహ్యమైన రెస్పాన్స్‌ని దృష్టిలో పెట్టుకొనే.. సుకుమార్ ఈ 400 కోట్ల స్కెచ్ గీస్తున్నాడని సమాచారం. సాధారణంగానే సీక్వెల్స్‌పై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ అవి మెప్పించగలిగితే మాత్రం, బాక్సాఫీస్‌కి బొమ్మ కనిపించడం ఖాయం. బాహుబలి2, కేజీఎఫ్2 ఆ విషయాన్ని నిరూపించాయి. పుష్పతోనూ అదే రిపీట్ చేయాలన్నది సుకుమార్ ప్లాన్.