వివాదాస్పద ప్రసంగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నిర్మాత బండ్ల గణేశ్.. చోర్ బజార్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘‘ఎందరినో స్టార్ హీరోల్ని చేసిన నీకు, నీ కొడుకు ఈవెంట్ కి రావడానికి టైం లేదా? ముంబైలో వెళ్లి కూర్చున్నావ్’’ అంటూ ఓ రేంజ్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంతేకాదు.. ‘పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నావ్, వాళ్లందరినీ చచ్చేదాకా చూసుకోవాల్సిన బాధ్యత నీదే’నంటూ వ్యక్తిగతంగానూ టార్గెట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా పూరీ జగన్నాథ్ పరోక్షంగా స్పందిస్తూ.. బండ్ల గణేశ్ కి స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చాడు.
‘‘గుర్తుపెట్టుకోండి.. మన నాలుక కదులుతున్నంతసేపూ మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే లైఫ్‌లో ఎక్కువ టైం లిజనర్స్(వింటూ ఉంటే)గా ఉంటే చాలా మంచిది. మీ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్, ఆఖరికి కట్టుకున్న పెళ్లాం ముందు కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్‌గా వాగొద్దు, చీప్‌గా ప్రవర్తించొద్దు. మన వాగుడు మన కెరీర్‌ను, మన క్రెడిబులిటీని డిసైడ్ చేస్తుంది. మీకు సుమతీ శతకం గుర్తుండే ఉంటుంది. నొప్పింపక తానొవ్వక.. తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ! తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం చాలా మంచిది. ఫైనల్‌గా ఓ మాట.. నీ బతుకు, నీ చావు అనేవి నీ నాలుక నాలుక మీద ఆధారపడి ఉంటాయి’’ అంటూ తన పూరీ మ్యూసింగ్స్ లో భాగంగా యూట్యూబ్ లో పూరీ జగన్నాథ్ ఓ ఆడియో వదిలాడు.
బండ్ల గణేశ్ స్పీచ్ తర్వాత ఇది రిలీజ్ చేయడం, ప్రత్యేకంగా నాలుక మీదే ఈ ఆడియో ఉండడంతో.. బండ్ల గణేశ్ కి కౌంటర్ గానే పూరీ దీనిని రిలీజ్ చేశాడని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఎంత సాన్నిహిత్యం ఉన్నా, మరీ వ్యక్తిగత జీవితం గురించి ఓ వేదికలో అలా మాట్లాడటం కరెక్ట్ కాదని ఇదే సమయంలో హితవు పలుకుతున్నారు. ఇక్కడ పూరీ మరీ సీరియస్ గా కాకుండా సింపుల్ గా రియాక్ట్ అవ్వడం పట్ల పూరీని మెచ్చుకుంటున్నారు.