పునీత్ రాజ్ కుమార్ – ఈ పేరు వినగానే కన్నడ జనాల్లో ఓ ఆనందతరంగం ఎగసి పడుతుంది. పునీత్ చురుకైన అభినయం చూసి ముగ్ధులై పోయిన జనం, ఆయన మానవత్వాన్ని తెలుసుకొని మరింత అభిమానం పెంచుకున్నారు. సదా మోముపై చిరునవ్వులతో కనిపించిన పునీత్ అభిమానులను శోకసంద్రంలో ముంచి వెళ్ళిపోయారు. కానీ, ఆయన నవ్వు మాత్రం అభిమానుల హృదయాల్లో నిలచే ఉంది. తన సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవకే వినియోగించే ఆ మంచి మనిషి ఇక రాడని తెలిసిన గుండెలు అవిసిపోయేలా ఏడ్చి, అలసి పోయాయి. వారందరికీ ఊరట కలిగిస్తూ పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజయిన మార్చి 17న ఆయన నటించిన జేమ్స్ సినిమా విడుదలయింది. కన్నడ నాటనే కాదు, తెలుగులోనూ జేమ్స్ గా అలరించడానికి పునీత్ వచ్చారు. పునీత్ మంచితనం గురించి తెలిసిన వారందరూ జేమ్స్ను చూడాలని అభిలషిస్తున్నారు.
తండ్రికి తగ్గ తనయుడు!
ప్రఖ్యాత కన్నడ నటసార్వభౌముడు రాజ్ కుమార్ చిన్న కొడుకు పునీత్. 1975 మార్చి 17న పునీత్ చెన్నైలో జన్మించారు. తొలుత ఆయన పేరు లోహిత్. ఐదేళ్ల ప్రాయంలోనే తండ్రి రాజ్ కుమార్ హీరోగా నటించిన వసంత గీత చిత్రంలో అభినయించి ఆకట్టుకున్నారు. తరువాత అనేక చిత్రాలలో బాలనటునిగా పరవశింపచేశారు పునీత్. పది సంవత్సరాల ప్రాయంలో పునీత్ బెట్టద హూవు చిత్రంలో నటించి, ఉత్తమ బాలనటునిగా జాతీయ అవార్డును అందుకున్నారు. మహానటుడు రాజ్ కుమార్ సైతం నటునిగా జాతీయ అవార్డు అందుకోలేదు. ఇక పునీత్ అన్నలు శివ రాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ సైతం ఆ క్రెడిట్ పొందలేదు. అందువల్ల కన్నడనాట పునీత్ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది.
తెలుగువారితో అనుబంధం!
రాజ్ కుమార్ కు తెలుగువారితో ఎంతో అనుబంధం ఉంది. ఆయన చిత్రసీమలో ప్రవేశించిన సమయంలోనే తొలి చిత్రం బేడర కన్నప్పను తెలుగులో కాళహస్తి మహాత్మ్యంగా తెరకెక్కించారు. అందులో భక్తకన్నప్పగా రాజ్ కుమార్ ప్రదర్శించిన నటన తెలుగువారిని సైతం ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటి నుంచీ రాజ్ కుమార్ అంటే తెలుగువారికి అభిమానం. ఆయన నటించిన అనేక చిత్రాలు తెలుగులోకి అనువాదమై అలరించాయి. మన నటరత్న యన్టీఆర్, నటసమ్రాట్ ఏయన్నార్ తో రాజ్ కుమార్ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. బెంగళూరులో తెలుగు చిత్రాలు విశేషంగా విడుదలవుతాయి. సదరు చిత్రాలను చూసి, రాజ్ తనయులు సైతం తెలుగు హీరోలను అభిమానించేవారు. బాలనటునిగానే భళా అనిపించిన పునీత్ రాజ్ కుమార్ మన తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన అప్పు చిత్రంతోనే హీరోగా పరిచయం కావడం విశేషం. ఈ సినిమాతో జనం మదిలో అప్పుగా నిలచిపోయారు పునీత్. ఇదే సినిమా తెలుగులో ఇడియట్గా పూరి దర్శకత్వంలోనే రీమేక్ అయింది. అప్పు తరువాత వరుసగా పునీత్ నటించిన ఆరు చిత్రాలు శతదినోత్సవం జరుపుకోవడం విశేషంగా నిలచింది.
కన్నడనాట పవర్ స్టార్..
కన్నడ చిత్రసీమలో పవర్ స్టార్గా జేజేలు అందుకున్నారు పునీత్ రాజ్ కుమార్. ఆయన నటించిన అభి, వీరకన్నడిగ, మౌర్య, ఆకాశ్, అజయ్, అరసు, మిలన, వంశీ, రామ్, జాకీ, హుడుగరు, రాజకుమార, అంజనీపుత్ర వంటి చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. కన్నడనాట అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న హీరోగా పునీత్ నిలిచారు. తండ్రి రాజ్ కుమార్ లాగే పునీత్ సైతం నటగాయకుడు. పునీత్ పాడిన పాటలు కన్నడనాడును ఊపేశాయి. పీఆర్.కే. అనే సొంత ఆడియో కంపెనీపై పునీత్ పాటలు విడుదలయ్యేవి. కన్నడద కోట్యాధిపతి హోస్ట్ గానూ అలరించారు పునీత్. తన సంపాదనలో కొంతభాగం సామాజిక సేవకై వినియోగించేవారు. ఎంతోమంది పేదపిల్లలను చదివించేవారు. కన్నడనాట ప్రకృతివైపరీత్యాలు సంభవించినప్పుడు అందరికంటే ముందుగా స్పందించి, చేతనైన సాయం అందించేవారు. అలా జనం మదిలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న పునీత్ 2021 అక్టోబర్ 29న హఠాన్మరణం చెందారు. ఆయన లేరన్న వార్త విని అభిమానులు, కన్నడ జనం విలవిలలాడి పోయారు. ఎంతటి గాయాన్నైనా మాన్పేసే శక్తి కాలానికి ఉందంటారు. కానీ, పునీత్ తలపుల్లో నిలచిన అభిమానుల హృదయగాయాలు ఇప్పుడిప్పుడే మానుతున్నాయి. వారిలో మళ్ళీ ఆనందం నింపేందుకు అన్నట్టుగా పునీత్ రాజ్ కుమార్ జయంతి మార్చి 17న జేమ్స్ జనం ముందు నిలిచింది. జేమ్స్ పునీత్ అబిమానులను సేద తీరుస్తుందని భావించవచ్చు.
