Pruthviraj Sukumaran: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్.’ మూవీ ఆస్కార్ విజేతగా నిలిచిన తర్వాత ప్రపంచ సినీ ప్రేక్షకులందరి చూపు పాన్ ఇండియా మూవీస్ పై పడింది. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు, తమిళ, కన్నడతో పాటు మలయాళ చిత్రసీమ నుండి సైతం పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో తమదైన ముద్రను వేసిన ఘనత మలయాళీ దర్శకుల సొంతం. విశేషం ఏమంటే… ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ లో ఓ మంచి దర్శకుడు కూడా ఉన్నాడు. అతను రూపొందించిన పలు చిత్రాలు వివిధ భాషల్లోకి రీమేక్ కూడా అయ్యాయి. కానీ కొన్ని సార్లు అతను కేవలం నటనకే పరిమితమవుతుంటాడు కూడా. అలాంటి ఓ సినిమా అతి త్వరలో అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడబోతోంది. అదే ‘ఆడుజీవితం’. ఇది పాన్ ఇండియా మూవీ మాత్రమే కాదు… కథ రీత్యా పాన్ వరల్డ్ మూవీ.
జాతీయ అవార్డు గ్రహీత బ్లెస్సీ తెరకెక్కించిన ‘ఆడుజీవితం’ మూవీని ఇంగ్లీష్ లో ‘గోట్ లైఫ్’ పేరుతో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు సిద్ధం చేస్తున్నారు. అయితే అందుకోసం రెడీ చేసిన ట్రైలర్ ఇప్పుడు యూ ట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. ఈ థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్ కు ఇద్దరు అకాడమీ అవార్డ్ విన్నర్స్ వర్క్ చేస్తున్నారు. అందులో ఒకరు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ కాగా మరొకరు సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి. అలానే భారతదేశంలోనే ఎడిటింగ్ విభాగంలో అత్యధిక అవార్డులను అందుకున్న శ్రీకర ప్రసాద్ దీనికి కూర్పరిగా వ్యవహరిస్తున్నారు. సునీల్ కె.ఎస్. సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్న ఈ చిత్రానికి బెన్యామిన్ కథను అందించారు. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ‘ఆడుజీవితం’ విడుదల తర్వాత ఎంతటి సంచలన విజయాలను నమోదు చేసుకుంటుందో చూడాలి.