V. Mahesh: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత వి. మహేష్ కన్నుమూశారు. 85 ఏళ్ల మహేష్ .. శనివారం రాత్రి చెన్నైలోని తన ఇంటి బాత్ రూమ్ లో కాలుజారి కిందపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. వి. మహేష్ అప్పట్లో మంచి మంచి తెలుగు సినిమాలను నిర్మించారు. 1975లో మాతృమూర్తిసినిమా ద్వారా మహేష్ నిర్మాతగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఆయనకు మంచి పేరునే తీసుకొచ్చి పెట్టింది.
ఇక ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ హీరోగా మనుషులంతా ఒక్కటే, మహాపురుషుడు సినిమాలు తీశారు. ఆ తరువాత చిరంజీవి హీరో సింహపురి సింహం సినిమాకు తెరకెక్కించారు. ఇక సుమన్ నటించిన ముసుగు దొంగ సినిమాను కూడా ఈయనే నిర్మించారు. సినిమాలు మాత్రమే కాకుండా పలు సీరియల్స్ కు కూడా రైటర్ మరియు నిర్మాతగా వ్యవహరించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌లో ప్రసారమైన హరి భక్తుల కథలు సీరియల్‌కి ప్రొడ్యూసర్, రైటర్‌గా పనిచేశారు. ఈ సీరియల్ కు ఎంతోమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక నెల్లూరుకు చెందిన మహేష్.. ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయారు. ప్రముఖ టెలివిజన్ నిర్మాత, దర్శకుడు వల్లభనేని మహీధర్.. మహేష్ మేనల్లుడే. ఇకపోతే మహేష్ అంత్యక్రియలు నేడు చెన్నైలో జరిగాయి. ఈ విషయం తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.