అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో సీనియర్ యాక్టర్. స్టార్ గా ఎదిగిన ఆయన దశాబ్దాలుగా నటిస్తున్నాడు. అయితే, ఆయన ఖాతాలో ఎన్నో సినిమాలున్నా ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్కటి కూడా చారిత్రక చిత్రం లేదు. కాకపోతే, ప్రతిష్ఠాత్మక యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రస్తుతం ‘పృథ్వీరాజ్’ సినిమా నిర్మిస్తోంది ఖిలాడీ కుమార్ తో! ఇది మహారాజు పృథ్వీరాజ్ చౌహాన్, ఆయన పట్టుపురాణి సంయుక్తల ప్రేమగాథ. అక్షయ్ కెరీర్ లో తొలి చారిత్రక చిత్రం!
తన ఫస్ట్ హిస్టారికల్ మూవీ చేస్తోన్న అక్షయ్ కేవలం ప్రేమ కథకి, ప్రణయ సల్లాపాలకి పరిమితం కావటం లేదట. ‘పృథ్వీరాజ్’ సినిమాలో భారీ యుద్ధ సన్నివేశాలుంటాయని ప్రచారం సాగుతోంది. ముంబైలోని ఓ ప్రాంతంలో ఇప్పటికే పెద్ద పెద్ద సెట్టింగ్స్ వేసి కొన్ని కీలక యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు. అక్షయ్, సంజయ్ దత్ మధ్య పోరాటాల్నీ భారీ ఎత్తున తెరకెకిస్తున్నట్లు సమాచారం. సెకండ్ హాఫ్ లో వచ్చే బ్యాటిల్ సీన్స్ ప్రేక్షకుల్ని విస్మయపరుస్తాయట!
దర్శకుడు చంద్రప్రకాశ్ ద్వివేది సారథ్యం వహిస్తోన్న ‘పృథ్వీరాజ్’, 2017 సంవత్సరానికిగానూ మిస్ వరల్డ్ గా నిలిచిన లెటెస్ట్ బ్యూటీ క్వీన్ మానుషీ చిల్లర్ కి, డెబ్యూ మూవీ! చూడాలి మరి, ఇప్పటికైతే దివాలీకి వస్తామని చెబుతోన్న ‘పృథ్వీరాజ్’ టీమ్ ఎలాంటి సర్ ప్రైజ్ తో ఎంటర్టైన్ చేస్తారో! కాకపోతే, గతంలో ప్రకటించినట్టుగా అక్షయ్ కుమార్ హిస్టారికల్ మూవీ దీపావళికి వస్తుందా అన్నదే అనుమానం. తాజా లాక్ డౌన్ వల్ల ‘పృథ్వీరాజ్’ కూడా అర్థాంతరంగా ఆగిపోయింది.