పలువురి బాటలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా డిజటల్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అందులో భాగంగా తన తొలి డిజిటల్ సిరీస్‌ను ప్రకటించాడు. ‘బిస్కట్ కింగ్’ టైటిల్‌తో రాబోతున్న ఈ సిరీస్ రాజన్ పిళ్లై జీవితం ఆధారంగా రూపొందనుంది. బ్రిటానియా ఇండస్ట్రీస్‌లో వాటా ఉన్న ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త రాజన్ పిళ్లై. అయితే మోసం, నమ్మక ద్రోహం కేసులో అరెస్టయి తీహార్ జైలులో 1995లో చనిపోయాడు. రాజన్‌ను ‘బిస్కెట్ బారన్’, ‘బిస్కెట్ కింగ్’ అని పిలిచేవారు. ఇప్పుడు అతని జీవిత కథనే సీరీస్ గా తీస్తున్నారు. ఈ సిరీస్ లో టైటిల్ రోల్ చేయటంతో పాటు దర్శకత్వం కూడా వహించనున్నాడు పృథ్వీరాజ్. ఈ సినిమాను యోడ్లీ ఫిలింస్ నిర్మించనుంది. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ ట్వీట్ చేసింది. ‘లూసిఫర్’తో దర్శకుడుగా హిట్ కొట్టిన పృథ్వీరాజ్ ప్రస్తుతం ‘బ్రో డాడీ’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ తర్వాత పృథ్వీరాజ్ దర్శకత్వం వహించే ప్రాజెక్ట్ ఇది. ‘లూసిఫర్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవగా… బ్రో డాడీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.