Prasanth Varma: ప్రశాంత్ వర్మ.. ప్రశాంత్ వర్మ.. ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ అనుకున్నది సాధించాడు. అ! అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఆ తరువాత రాజశేఖర్ హీరోగా కల్కి సినిమాను తెరకెక్కించాడు. అసలు హీరోగా రాజశేఖర్ ను మర్చిపోయిన జనాలకు మళ్లీ తన కథతో రాజశేఖర్ హిట్ అందుకునేలా చేశాడు. ఆ తరువాత తెలుగులో మొట్ట మొదటి జాంబీని పరిచయం చేసింది మనోడే. తేజ సజ్జా హీరోగా జాంబీ రెడ్డి తెరకెక్కించి అదరగొట్టాడు. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ప్రశాంత్.. ఇప్పుడు హనుమాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొట్ట మొదటి సూపర్ హీరో కథగా హనుమాన్ తెరకెక్కింది. నేడు రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మొదటి నుంచి కూడా ఎన్నో ఆటంకాలతో కదిలింది. అసలు ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయని.. ప్రశాంత్ వర్మనే తగ్గుతూ వచ్చాడు. ఇక ఈసారి కూడా అదే ఆటంకం.
సంక్రాంతి రేసులో 5 సినిమాలు ఉన్నప్పుడు హనుమాన్ వెనక్కి తగ్గాలని చాలా బలవంతం జరిగింది. అయినా కూడా ప్రశాంత్ వర్మ తగ్గలేదు. చాలామంది ఇతడికి పొగరు అని చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో సైతం.. హనుమాన్ హిట్ అయితే.. అవతార్ కన్నా మంచి సినిమా తీస్తా అని చెప్పడంతో మనోడికి అహంకారం మాములుగా లేదని ట్రోల్ చేశారు.ప్రతి ఇంటర్వ్యూలో కూడా పెద్ద సినిమాలతో పోటీ పడుతున్నారు అన్నా కూడా.. తన కథపై, తన టేకింగ్ పై నమ్మకం పెట్టుకొని.. ఖచ్చితంగా హిట్ కొడతాను అని ధైర్యంగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ నమ్మకం గెలిచింది. ఆ దైర్యం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా మారింది. అప్పుడు ఏంటి ఈ అహంకారం అన్నవారే.. ఇప్పుడు ఈ రేంజ్ టాలెంట్ కు.. ఆ మాత్రం అహంకారం.. అలంకారమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ తో ఈ మాటను నిలబెట్టుకుంటాడా.. ? లేదా..? అనేది చూడాలి.