Prakash Raj Sensational Comments On Politics: తాను ఏ రాజకీయ పార్టీలో లేకపోయినప్పటికీ, రాజకీయ విషయాల్లో అప్పుడప్పుడు గళం ఎత్తుతుంటారు నటుడు ప్రకాశ్ రాజ్. ఆయా వ్యవహారాలపై నేరుగా ప్రధానమంత్రి మోడీనే ఆయన ప్రశ్నించారు. ఏదైనా రాజకీయ దుమారం రేగినప్పుడు.. కచ్ఛితంగా తనదైన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటారు. ఇలా రాజకీయ విషయాల్లో చురుకుగా ఉండటంతో.. ఇప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో అయినా క్రియాశీల రాజకీయాల్లోకి ప్రకాశ్ రాజ్ ఎంట్రీ ఇవ్వొచ్చని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే.. అందుకు ఆయన తాజాగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని, ప్రజల్లోనే ఉంటూ ఈ భారతదేశ పౌరుడిగా ప్రశ్నిస్తుంటానని క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ఒక పౌరుడిగా ఈ దేశంలో పుట్టినప్పుడు మనమంతా రాజకీయంలో ఉన్నట్టేనని అన్నారు. మనం ఇచ్చే ట్యాక్స్ డబ్బులతోనే అన్నీ జరుగుతున్నప్పుడు.. ప్రశ్నించే హక్కు మనకుందని చెప్పారు. రాజకీయ నాయకులే ఇంటికొచ్చి ఆయా పనులు చేస్తామని హామీలు ఇచ్చి చేయనప్పుడు, మనం ప్రశ్నించాల్సిందేనని పేర్కొన్నారు. ఒక దేశ పౌరుడిగానే కాకుండా, ఒక నటుడిగా జనాలు ఇంత ఆదరిస్తున్నప్పుడు.. వాళ్ల తరఫున ప్రశ్నించడం తన బాధ్యత అని తెలిపారు. వేరే వాళ్లు అలా ఎందుకు ప్రశ్నించడం లేదో తనకు తెలియదని, తాను మాత్రం నిజాయితీగానే ఉన్నానని వెల్లడించారు. ప్రజలే పవర్‌ఫుల్ అని, రాజకీయ నాయకులు కాదని తేల్చి చెప్పారు. వాళ్లకు జీతం ఇచ్చి అధికారంలో పెట్టేదే ప్రజలేనని, వారి వల్ల మన సమాజం ఎలా డెవలప్ అవుతోందనే విషయాలపై నిలదీయాల్సిందేనని అన్నారు.
‘మరి.. మరో పదేళ్లలో మీరు ఫుల్‌టైమ్ రాజకీయాల్లో చూడొచ్చా?’ అని ప్రశ్నిస్తే.. తనని ఫుల్‌టైమ్ మనిషిగా చూడొచ్చని ప్రకాశ్ రాజ్ బదులిచ్చారు. తాను ఓవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు పౌరుడిగా ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని, జనం తరఫున నుంచి తన గొంతు వినిపిస్తానని అన్నారు. ఏదైనా మార్పు జరగాలంటే అది ప్రజల నుంచే అవుతుందని, ప్రజలే లీడర్స్‌లాగా అవతారం ఎత్తాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్కరికి అమ్ముడుపోకుండా, ప్రశ్నించడం మొదలుపెడితే మార్పు తప్పకుండా వస్తుందన్నారు. ఏ విధంగా అయితే ఒక అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు అబ్బాయి గురించి వివరాలు తెలుసుకుంటామో.. నాయకుడు కూడా పాలించడానికి అర్హుడా? కాడా? అనేది ఆలోచించాలని సూచించారు.