సాధారణంగా ఒకట్రెండు హిట్లు పడగానే హీరోలు తమ పారితోషికాన్ని పెంచేస్తుంటారు. గత సినిమాలు రాబట్టిన కలెక్షన్లు, దాని వల్ల తమకు పెరిగిన మార్కెట్ & క్రేజ్ ని బట్టి.. హీరోలు కొంత అమౌంట్ పెంచుతారు. నిర్మాతలు సైతం ఆయా హీరోలకున్న క్రేజ్ ని చూసి.. అడిగినంత డబ్బులు ఇవ్వడానికి రెడీ అయిపోతారు. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకున్నదెవరైనా ఉన్నారంటే.. అది రెబెల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం, సాహోకి నెగెటివ్ టాక్ వచ్చినా తనకున్న ఇమేజ్ వల్ల మంచి కలెక్షన్లు నమోదు చేయడాన్ని చూసి.. ప్రభాస్ తన ఫిగర్ ని భారీగా పెంచేశాడు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. బాహుబలి తర్వాత ప్రభాస్ ఒక్కో సినిమాకి గాను అక్షరాల రూ. 100 కోట్లు అందుకున్నాడట. ఇప్పుడు ఇతను అదనంగా మరో రూ. 20 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అంటే.. టోటల్ గా ఇతని పారితోషికం రూ. 120 కోట్లన్నమాట! ప్రస్తుతం ఏయే సినిమాలు సెట్స్ మీద ఉన్నాయో, వాటన్నింటికీ ప్రభాస్ ఆ హైక్ ని అందుకోబోతున్నట్టు వినికిడి. ‘సలార్’ మీద ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. పైగా.. దీనిని రెండు భాగాలుగా తీస్తున్నారు. మొదట్లో ఒక పార్టే అనుకున్నారు గానీ, ఆ తర్వాత రెండు భాగాలుగా కథని డెవలప్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ రూ. 20 కోట్లు ఎక్కువ అడిగినట్టు తెలుస్తోంది.
ఇక ప్రాజెక్ట్ కే ప్యాన్ వరల్డ్ సబ్జెక్ట్ కావడం, దానికి బల్క్ డేట్స్ ఇవ్వడంతో.. నిర్మాతలే ప్రభాస్ కి ఎక్కువ అమౌంట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు ఇన్ సైడ్ న్యూస్! ఒకవేళ ఇదే నిజమైతే.. పారితోషికం విషయంలో ప్రభాస్ ని కొట్టడం, ఇప్పుడప్పుడే ఏ స్టార్ హీరోకి సాధ్యం కాదని చెప్పుకోవచ్చు. అన్నట్టు.. ‘రాధేశ్యామ్’ సినిమాకి డిజాస్టర్ అవ్వడం, నిర్మాతలు చాలా నష్టాలు చవిచూడడంతో, ప్రభాస్ తన పారితోషికం మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడని సమాచారం.