Pooja Hegde: బాలీవుడ్, కోలీవుడ్ వయా టాలీవుడ్.. పూజా హెగ్డే రీ-ఎంట్రీ మామూలుగా లేదుగా!

Pooja Hegde Remuneration

Pooja Hegde Remuneration

Pooja Hegde: ఒకప్పుడు టాలీవుడ్‌లో ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్‌గా వినిపించిన ఒకే ఒక్క పేరు పూజా హెగ్డే. వరుస హిట్లతో తెలుగు తెరను ఏలిన ఈ బుట్టబొమ్మ, 2022 తర్వాత సడెన్‌గా ఇక్కడ మాయమైపోయింది. పూజానే కావాలని తెలుగు సినిమాలను పక్కన పెట్టిందా, లేక వరుస ఫ్లాపుల దెబ్బకు మన మేకర్సే ఆమెను దూరం పెట్టారా అన్న చర్చ గత నాలుగేళ్లుగా నడుస్తూనే ఉంది. కారణం ఏదైనా, గత నాలుగేళ్లుగా బాలీవుడ్, కోలీవుడ్ చుట్టూ తిరిగి వచ్చిన పూజా హెగ్డే, ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న తీరు చూస్తుంటే.. రీ-ఎంట్రీ మామూలుగా లేదుగా అనిపించక మానదు. 2022 ఏప్రిల్‌లో రామ్ చరణ్ సరసన నటించిన ‘ఆచార్య’ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన తర్వాత, పూజా హెగ్డే పూర్తిస్థాయి హీరోయిన్‌గా మళ్ళీ తెలుగులో కనిపించలేదు. ఆ తర్వాత నెలలో వచ్చిన ‘ఎఫ్ 3’ చిత్రంలో కేవలం ఒక స్పెషల్ సాంగ్‌తో సరిపెట్టుకుంది.

టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో, పూజా తన రూట్ మార్చి హిందీ, తమిళ ఇండస్ట్రీలపై దృష్టి పెట్టింది. బాలీవుడ్‌లో ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, ‘దేవా’, ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ వంటి సినిమాలతో పాటు, కోలీవుడ్‌లో ‘రెట్రో’, ‘కూలీ’, ‘జన నాయగన్’ వంటి భారీ ప్రాజెక్టులలో నటిస్తూ అక్కడ ఫుల్ బిజీ అయిపోయింది. ఇలా నాలుగేళ్ల పాటు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను చుట్టేసిన ఈ బుట్టబొమ్మ, ఇప్పుడు టాలీవుడ్‌కు చాలా పక్కా ప్లాన్‌తో తిరిగి వస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా రవి నేలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీ శ్రీ’ అనే రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పూజా టాలీవుడ్ రీ-ఎంట్రీ ఖాయమైంది. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తనకు ‘అల వైకుంఠపురములో’ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో పూజా పేరు బలంగా వినిపిస్తోంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా పూజాను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఒకవైపు దుల్కర్ సల్మాన్ లాంటి క్రేజీ హీరో, మరోవైపు అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ లాంటి పాన్-ఇండియా కాంబో.. ఇలా నాలుగేళ్ల గ్యాప్ తర్వాత పూజా వేస్తున్న అడుగులు చూస్తుంటే సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. మరి ఈ సినిమాలతో బుట్టబొమ్మ మళ్ళీ టాలీవుడ్ టాప్ చైర్‌ను దక్కించుకుంటుందో లేదో చూడాలి.