పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘రాధేశ్యామ్’లో ప్రేరణగా నటించిన పూజా హెగ్డే మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
రాధే శ్యామ్‌లో మీ పాత్ర గురించి చెప్పండి?
ఈ సినిమాలో నా పాత్ర పేరు ప్రేరణ. డిఫరెంట్ షేడ్స్, డెప్త్, ఎమోషన్స్ ఉన్న ఇంట్రెస్టింగ్ రోల్ ఇది. ఈ క్యారెక్టర్ కోసం చాలా రీసెర్చ్ చేశాను. ప్రేరణ నాలో చాలా మార్పు తెచ్చింది.
మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతారా?
అవును… నేను నమ్ముతాను. మన భారతీయ సంస్కృతి చాలా గొప్పదని నేను నమ్ముతాను. టెలిస్కోప్‌ను కనిపెట్టక ముందే మన పూర్వీకులు చాలా విషయాలను కనుగొన్నారు. జాతకాలు నిజం అవుతాయని నిరూపించిన ఉదాహరణలు చాలా ఉన్నాయి.
తెలుగులో స్టార్ హీరోలతో పని చేసిన అనుభవం ఎలా ఉంది ?
జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు, ఎనర్జిటిక్ కూడా. ఏ సీన్ అయినా సింగిల్ టేక్‌లో చేసేస్తాడు. అల్లు అర్జున్ ఎనర్జిటిక్ యాక్టర్. ప్రభాస్ విషయానికి వస్తే… ఆయన చాలా సిగ్గుపడతాడు, ఫన్నీ కూడా. టీమ్‌లోని కొంతమంది వ్యక్తులు ఇటలీలో కోవిడ్ బారిన పడినప్పుడు, ప్రభాస్ వారందరికీ ఆహారం పంపేవాడు. ప్రభాస్ లోని ఈ మంచితనాన్ని చూసి మా అమ్మ చాలా సంతోషపడింది.
Read Also : Radhe Shyam Press Meet : లైవ్
‘రాధే శ్యామ్’లో మీకు ఏది సవాలుగా అనిపించింది?
ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. ఒకే సన్నివేశాలను వెంటనే 2 భాషల్లో చేయడం చాలా కష్టంగా అనిపించింది. నేను తెలుగు వెర్షన్‌లో ఎమోషనల్ సీన్ చేసినప్పుడు, దర్శకుడు వెంటనే హిందీలో కూడా అదే ఇంటెన్సిటీతో చేయమని అడిగారు. సన్నివేశాలు ఒకేలా ఉన్నా మ్యాజిక్ మాత్రం వేరు.
ప్రజలు ఈ సినిమాను టైటానిక్‌తో పోలుస్తున్నారు. దాని గురించి ఏమంటారు ?
ఏదైనా ఓడ మునిగిపోతున్నట్లు కన్పిస్తే… మీరు టైటానిక్ విషాదానికి కనెక్ట్ అవుతారు. అయితే ‘రాధే శ్యామ్’ని ఇంత క్లాసిక్ సినిమాతో పోల్చడం విశేషం. ‘రాధే శ్యామ్’ టైటానిక్ కాదు… కానీ ఓడ మాత్రమే రెండింటిలోనూ కామన్.
మిమ్మల్ని పాన్-ఇండియా నటి అని పిలవడం ఎలా అనిపిస్తుంది?
అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలనుకున్నాను. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాను అంగీకరిస్తున్నాను. కానీ నా కెరీర్‌ను టాలీవుడ్‌లో ప్రారంభించినందున తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా నేర్చుకున్నాను.
పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ల సినిమా గురించి చెప్పండి?
దీని గురించి హరీష్‌ని అడగాలి. దానిపై వ్యాఖ్యానించడానికి ఇది సరైన సమయం కాదు.
మహిళా నటిగా ఎలాంటి సినిమాలు చేస్తారు?
మహిళల్లో స్ఫూర్తిని నింపే సినిమాలు చేయాలనుకున్నాను. సావిత్రి గారు, హేమ మాలిని గారు వంటి దిగ్గజ నటీమణులు అనేక మహిళా ఆధారిత సినిమాలు చేశారు. అవి కమర్షియల్ గా కూడా విజయవంతమయ్యాయి. అరవింద సమేతలో నా పాత్ర కూడా అంత పవర్ ఫుల్ గా ఉంటుందని భావిస్తున్నాను.
భవిష్యత్ ప్రాజెక్టులు?
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది. నా కిట్టీలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. వాటిని త్వరలో ప్రకటిస్తారు.