అక్కినేని నాగార్జున ‘సిసింద్రి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూజా బాత్రా! అందులో స్పెషల్ సాంగ్ లో నర్తించిన పూజా బాత్రా… ఆ తర్వాత దాసరి నారాయణ రావు తన కొడుకు అరుణ్ కుమార్ ను హీరోగా పరిచయం చేసిన ‘గ్రీకువీరుడు’లో హీరోయిన్ గా నటించింది. హిందీ, తెలుగుతో పాటు పలు మలయాళ చిత్రాలలోనూ నటించిన పూజా బాత్రా 2002లో ఎన్.ఆర్.ఐ. డాక్టర్ సోనూ అహ్లూవాలియా ను పెళ్ళాడి అమెరికాకు మకాం మార్చేసింది. అయితే ఎనిమిదేళ్ళ కాపురం తర్వాత 2011లో భర్త నుండి పూజా బాత్రా విడిపోయింది. ఆ పైన ఇద్దరూ విడాకులకు అప్లయ్ చేశారు. డైవర్స్ వచ్చిన తర్వాత నటుడు నవాజ్ షా ను 2019లో పెళ్ళి చేసుకుంది పూజా బాత్రా. అప్పటి నుండి సినిమాల్లో రీ-ఎంట్రీ కోసం ప్రయత్నిస్తోంది. తాజాగా ఆమె కోరిక తీరింది. ఈ నెల 12న జీ 5లో స్ట్రీమింగ్ కాబోతున్న ‘స్క్వాడ్’ మూవీలో పూజా బాత్రా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాతో బాలీవుడ్ సీనియర్ నటుడు డానీ డి జంగ్పా తనయుడు రిన్ జింగ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా గురించి పూజా బాత్రా మాట్లాడుతూ, ‘దర్శక నిర్మాత నీలేష్ సహాయ్ ఇందులో నందినీ రాజ్ పుత్ అనే పాత్రను నన్ను దృష్టిలో పెట్టుకునే రాశారు. ఈ స్క్రిప్ట్ నాకెంతో నచ్చింది. అందుకే ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామినయ్యాను” అని తెలిపింది. దేశభక్తిని ప్రేరేపించే సన్నివేశాలతో పాటు ఎమోషనల్ బాండింగ్ సీన్స్ కూడా ఇందులో ఉన్నాయని పూజా బాత్రా చెబుతోంది. విశేషం ఏమంటే… ఆమె ద్వితీయ వివాహం చేసుకున్న నటుడు నవాజ్ షా తెలుగులో ఆ మధ్య వచ్చిన బాలకృష్ణ ‘డిక్టెటర్’లో నటించాడు.