ప్రముఖ తమిళ నేపథ్య గాయకుడు, నటుడు మాణిక్క వినాయగం అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. సమాచారం ప్రకారం సోమవారం అడయార్‌లోని వినాయగం నివాసంలో గాయకుడికి అంత్యక్రియలు చేస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని తెలుస్తోంది. విషయం తెలిసిన పలువురు సెలెబ్రిటీలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. వినాయగం ‘నాట్యాచార్య పద్మశ్రీ’ వజువూరు బి. రామయ్య పిళ్లై చిన్న కుమారుడు. వినాయకం తమిళంతో పాటు ఇతర దక్షిణ భారత భాషలలో 800 కంటే ఎక్కువ పాటలు పాడారు. అనేక చిత్రాలలో కూడా నటించారు.
ఆయన విక్రమ్ నటించిన ‘ధిల్’ (2001)లో ‘కన్నుకుల్లా కెలుతి’ పాటతో నేపథ్య గానంలోకి అడుగుపెట్టాడు. విదై కొడు ఎంగల్ నాదే – కన్నతిల్ ముత్తమిట్టల్ (2002), కొడువ మీసై – ధూల్ (2003) వంటి అనేక తమిళ బ్లాక్ బస్టర్ సాంగ్స్ పాడారు. సినిమాలకు పాడడమే కాకుండా వందలాది జానపద గీతాలు, భక్తిగీతాలు పాడారు. ఇక వినాయగం అతను ‘తిరుడ తిరుడి’ (2003) చిత్రంలో ధనుష్ తండ్రి పాత్రను పోషించాడు. ఇంకా గంభీరం, పెరళగన్ అరివుమణి వంటి పలు సినిమాలలో కూడా నటించాడు. తెలుగులోనూ మెగాస్టార్ చిరంజీవి ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘పట్టుపట్టు చేయ్యే పట్టు’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.