Sasanasabha: గత యేడాది ‘రెడ్’ మూవీలో ఐటమ్ సాంగ్ తో అలరించిన హెబ్బా పటేల్ ఇప్పుడు ‘శాసనసభ’ మూవీలోని స్పెషల్ సాంగ్ తో మాస్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. విశేషం ఏమంటే ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. వేణు మడికంటి దర్శకత్వం లో సాస్పని బ్రదర్స్ గా పాపులర్ అయిన తులసీ రామ్ సాప్పని, షణ్ముగం సాప్పని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ జంటగా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా హెబ్బా పటేల్ నర్తించిన సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బసురు సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. మంగ్లీ ఈ గీతాన్ని ఆలపించగా, సంతోష్ వెంకీ, రవి బసురు గొంతుకలిపారు. ‘నన్ను పట్టుకుంటే జారిపోతా’ అంటూ హెబ్బాపటేల్ ఈ పాటలో కుర్రకారును కిర్రెక్కించేలా స్టెప్పులు వేసింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో హెబ్బా నటించిన పెప్పీ పార్టీ సాంగ్ హైలైట్ గా నిలుస్తుందని ఈ లిరికల్ వీడియో చూస్తుంటే అర్థమైపోతోంది. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ రాఘవేంద్రరెడ్డి ఈ చిత్రానికి కథను అందించడం విశేషం. అతి త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.