‘పెంకిపెళ్ళాం’ చిత్రం గురించి చెప్పుకోవాలంటే, నటరత్న యన్.టి.రామారావు, దర్శకులు కమలాకర కామేశ్వరరావు మైత్రీబంధం గురించి తప్పకుండా ముచ్చటించుకోవడానికి ఈ సినిమా ఆస్కారమిస్తుంది. కామేశ్వరరావు ముక్కుసూటి మనిషి. ఏది అనిపిస్తే అదే చెప్పేవారు తప్ప ముఖస్తుతి ఆయన నచ్చదు. అలాంటి కామేశ్వరరావు రాసిన రివ్యూ నచ్చి మరీ మదరాసు పిలిపించుకున్నారు హెచ్.ఎమ్.రెడ్డి. తరువాత కామేశ్వరరావు , కేవీ రెడ్డి వద్ద అసోసియేట్ గా ‘పాతాళభైరవి’కి పనిచేశారు. ఆ సినిమా స్క్రీన్ ప్లేలోనూ కమలాకర పాత్ర ఉంది. అది గమనించిన విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి కమలాకరను ప్రోత్సహించారు. 1954లో యన్టీఆర్ హీరోగా కమలాకరను దర్శకునిగా పరిచయం చేస్తూ భారీ జానపదం ‘చంద్రహారం’ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు నాగిరెడ్డి-చక్రపాణి. ఆ సినిమా అనూహ్యంగా పరాజయం పాలయింది. దాంతో కమలాకరకు మరింత ఊరట కలిగిస్తూ ఒకప్పుడు కేవీ రెడ్డి రూపొందించిన జానపదం ‘గుణసుందరి కథ’ను తమిళంలో తెరకెక్కించే అవకాశం కల్పించారు విజయాధినేతలు.
విజయా బ్యానర్ పై రూపొందిన ‘గుణసుందరి’ లో సావిత్రి, జెమినీ గణేశన్ నటించారు. కమలాకరకు ఇది రెండవ చిత్రం. ఇదీ పరాజయాన్నే చవిచూసింది. ఈ సమయంలో యన్టీఆర్ తో ‘పెంకిపెళ్ళాం’ నిర్మించాలని డి.బి.నారాయణ, ఎస్.భావనారాయణ సంకల్పించారు. అప్పటికే రెండు ఫ్లాపులు తీసిన కమలాకరపై అనుమానాలు తలెత్తాయి. అయితే ‘పాతాళభైరవి’ నుంచీ కమలాకరతో ఉన్న స్నేహబంధం కారణంగా యన్టీఆర్, కామేశ్వరరావు సాంఘికం బాగా తీస్తారని భరోసా ఇచ్చారు. అలా ‘పెంకిపెళ్ళాం’కు కామేశ్వరరావు దర్శకుడయ్యారు. కానీ, ఈ మూడవ చిత్రం కూడా చేదు అనుభవమే చూపింది. అయినా, కమలాకర కామేశ్వరరావుపై రామారావుకు ఎంతో నమ్మకముంది. అందువల్ల తాము నిర్మించిన ‘పాండురంగ మహాత్మ్యం’కు ఆయననే దర్శకునిగా ఎంచుకున్నారు.
తనతో రెండు సినిమాలు ఫ్లాపులు తీసినా, కమలాకరపై ఎంతో నమ్మకముంది రామారావు ‘పాండురంగ మహాత్మ్యం’కు ఆయనను ఎంపిక చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమయింది. అయితే రామారావు నమ్మకం వమ్ము కాలేదు. ‘పాండురంగ మహాత్మ్యం’ ఘనవిజయం సాధించింది. ఆ తరువాత యన్టీఆర్, కమలాకర కాంబినేషన్ లో పలు పౌరాణికాలు రూపొంది విజయం సాధించాయి. జానపద, చారిత్రక, సాంఘికాలను సైతం యన్టీఆర్ తో తెరకెక్కించి అలరించారు కమలాకర.
ఇంతకూ ‘పెంకిపెళ్ళాం’ ఊసేమిటంటే – వ్యసనపరుడైన రంగయ్య ఒకరితో పోట్లాడుతూ హత్య చేస్తాడు. దాంతో జైలు పాలవుతాడు. అతని కూతురు సీత, కొడుకు రాజా అనాథలవుతారు. సీతను డబ్బున్న ఆసామి కొడుకు వాసు ప్రేమిస్తాడు. అయితే అది సహించని వాసు తల్లి సీతపై అబాండాలు వేసి ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది. అది తెలిసి వాసు కూడా ఇల్లు విడిచి వెళతాడు. ఇక రాజు చదువుకొని ఉద్యోగం చేస్తుంటాడు. రావు సాహెబ్ గోవిందరావు కూతురు సరోజ, రాజును ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. అక్క సీత కనిపిస్తే, ఇంటికి తీసుకు వస్తాడు రాజు. అయితే అది ఆయన భార్య సరోజకు నచ్చదు. సరోజ నగలను సుందరమ్మ అనే ఆమె దూరపు చుట్టం దొంగిలించి ఆ నేరం సీతపైకి నెడుతుంది. సరోజ వెనకా ముందు చూసుకోకుండా సీతను తిడుతుంది. నానా మాటలు అని సీత ఇంట్లోంచి వెళ్లేలా చేస్తుంది. దాంతో రాజు కోపంతో భార్యపై చేయి చేసుకుంటాడు. పుట్టింటికి చేరుతుంది సరోజ. అయితే తండ్రి బుద్ధి చెబుతాడు. వాసు పోలీస్ ఆఫీసర్ అవుతాడు. భార్యకోసం గాలిస్తూ ఉంటాడు. అవమాన భారం భరించలేని సీత చనిపోవాలనుకుంటుంది. ఆమెను అదే సమయంలో జైలు నుండి విడుదలయిన రంగయ్య రక్షిస్తాడు. అక్కడికే రాజు చేరుకొని అక్కను తీసుకు పోతాడు. వారిద్దరూ తన పిల్లలే అని రంగయ్య గ్రహిస్తాడు. చివరకు అసలు దొంగ సుందరమ్మ అని తేలిపోతుంది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తారు. రంగయ్య తన పిల్లలు సీత,రాజును కలుసుకుంటాడు. పోలీస్ ఆపీసర్ అయిన వాసు భార్యను చేరతీస్తాడు. సరోజ కూడా తప్పు తెలుసుకొని భర్త రాజు చెంత చేరుతుంది. కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో రాజుగా యన్టీఆర్, సీతగా జూనియర్ శ్రీరంజని, వాసుగా అమరనాథ్, సరోజగా రాజసులోచన, రంగయ్యగా నాగభూషణం నటించారు. మిగిలిన పాత్రల్లో రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం, పేకేటి శివరామ్, కె.వి.ఎస్.శర్మ, ఛాయాదేవి, ఇ.వి.సరోజ, హేమలత కనిపించారు. ఈ చిత్రానికి ఆరుద్ర సంభాషణలతో పాటు పాటలు పలికించారు. ఒకే ఒక్క “చల్ చల్ గుర్రం…” అనే పాటను వి.వి.ఎల్.ప్రభాకర్ రాశారు. ఈ చిత్రానికి కె.ప్రసాదరావు సంగీతం సమకూర్చారు. 1956 డిసెంబర్ 6న విడుదలైన ‘పెంకిపెళ్ళాం’ అప్పట్లో అంతగా అలరించలేదు. తరువాతి రోజుల్లో ఈ సినిమాను జనం బాగా ఆదరించారు. “పడచుదనం రైలు బండి పోతున్నది…” పాట అప్పట్లో విశేషాదరణ చూరగొంది. “భారము నీవేనయ్యా…”, “అమ్మా అమ్మా…”, “లేదోయ్ లేదోయ్ వేరే హాయి…”, “ఆడదంటే అలుసా…” , “సొగసరివాడు సోకైనవాడు…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి.