‘సర్కారు వారి పాట’లో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ మధ్య ఉండే లెగ్ ఎపిసోడ్‌పై ఓ వర్గం ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ద్వితీయార్థంలో కీర్తిపై మహేశ్ కాలేసుకొని పడుకోవడం చాలా వల్గర్‌గా ఉందని, అసలు ఇది అవసరమా? అంటూ పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై స్పష్టత ఇచ్చేందుకు దర్శకుడు పరశురామ్ మీడియా ముందుకొచ్చాడు. అందులో ఎలాంటి వల్గారిటీ లేదని, ఒకవేళ వల్గారిటీ ఉంటే, స్వయంగా మహేశే వద్దని చెప్పేవారని అన్నాడు. తల్లి దగ్గర నిద్రపోయే ఒక బిడ్డలా ఆ సీన్స్ ఉంటాయని.. ఆ ఉద్దేశంతోనే తాను ఆ సీన్స్ పెట్టానే తప్ప, అందులో వల్గారిటీ లేదని పరశురామ్ వివరణ ఇచ్చాడు.
కేవలం క్యారెక్టరైజేషన్ మాత్రమే కాదు, కథ కూడా నచ్చి మహేశ్ ఈ సినిమా చేశారని దర్శకుడు చెప్పాడు. కథ నచ్చకపోతే అసలు మహేశ్ సినిమా ఎందుకు చేస్తారని తిరిగి ప్రశ్నించాడు. ఇదే సమయంలో ఈ చిత్రంలో మహేశ్ వద్ద నుంచి కీర్తి తీసుకున్న అప్పుల్ని కూడా క్లారిటీగా చూపించలేదన్న ట్రోల్స్‌పై దర్శకుడు స్పందించాడు. సినిమాలో కీర్తి మొదట హీరో నుంచి $10K తీసుకుంటుంది. ఆ తర్వాత $25K అప్పుగా దండుకుంటుంది. ఈ లెక్కన మొత్తం బాకీ $35K అవుతుంది. కానీ.. సినిమాలో మహేశ్ మాత్రం ఆమెకు మొదటి ఇచ్చిన $10K మాత్రమే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంటాడు. దీనిపై ట్రోల్స్ బాగా రావడంతో, పరశురామ్ క్లారిటీ ఇచ్చాడు.
‘‘అవును, మొదట్లో హీరోయిన్‌కి హీరో $10K ఇస్తాడు. అయితే, ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు మరో $25K ఇస్తాడు. ప్రేమలో ఉన్నప్పుడు ఇచ్చిన డబ్బుల గురించి మహేశ్ పాత్ర ఖాతరు చేయదు. కాబట్టి, అప్పుల విషయంలో ఎలాంటి గందరగోళం లేదు’ అని పరశురామ్ చెప్పుకొచ్చాడు. కాగా.. తొలిరోజు మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం, భారీ వసూళ్ళతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.