Vaishnav Tej: పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దు కుంటున్న చిత్రం షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రచార చిత్రాన్ని సోమవారం విడుదల చేశారు. ఏప్రిల్ 29న ఈ మూవీ విడుదల కాబోతున్నట్టు దాని ద్వారా నిర్మాతలు తెలిపారు. తీగల కంచె ఆవల అస్పష్టంగా కనిపిస్తూ కథానాయకుడు నిలుచున్న తీరు, మరో వైపు కంచె తగలబడుతున్న వైనం చూస్తుంటే… ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ కు కొదవలేదనే విషయం అర్థం అవుతోంది. తొలిచిత్రం ‘ఉప్పెన’ తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారంతో ఈ సినిమా ద్వారా జనం ముందుకు రాబోతున్నట్టు అనిపిస్తోంది.