మార్వెల్ కామిక్స్ తో పరిచయం ఉన్న వారందరికీ సూపర్ హీరో సిరీస్ లో భలేగా హల్ చల్ చేసే కమలా ఖాన్ గుర్తుండే ఉంటుంది. ఆ పాత్రకు ప్రాణం పోసి తెరపై ఆవిష్కరిస్తోంది మార్వెల్ సంస్థ. ‘మార్వెల్స్’ సిరీస్ లో భాగంగా ‘ద మార్వెల్స్’లో కమలా ఖాన్ పాత్రలో పాకిస్థాన్ నటి ఇమాన్ వెల్లనీ నటించింది. ఈ నెలతో షూటింగ్ పూర్తి చేసుకొనే ‘ద మార్వెల్స్’ వచ్చే యేడాది జూలై 28న జనం ముందు నిలవనుంది. తొలిసారి ఓ సూపర్ హీరో సిరీస్ లో నటించిన ఇమాన్ వెల్లనీ ఆ సినిమా జనం ముందుకు ఎప్పుడు వస్తుందా? అది చూసి పాకిస్థాన్ లోని తన అభిమానులు ఏమంటారో చూడాలని ఉవ్విళ్ళూరుతోంది. పైగా ఇలా ఓ సూపర్ హీరో సిరీస్ లో మెయిన్ రోల్ లో నటించిన మొదటి ముస్లిమ్ గానూ ఇమాన్ వెల్లనీ చరిత్ర సృష్టించింది.
ఇమాన్ వెల్లని కన్నవారు పాకిస్థానీ ముస్లిమ్స్. అయితే వెల్లని పసిప్రాయంలో వారి కుటుంబం కెనడాకు వలస వెళ్ళింది. అందువల్ల వెల్లనికి పాకిస్థానీ కెనడియన్ అనే గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆమె కన్నవారు, బంధువులు అందరూ పాకిస్థాన్ లో ఉన్నారు. వారందరూ తాను నటించిన ‘ద మార్వెల్స్’ విడుదల కోసం ఎదురు చూస్తున్నారని, అది తనకెంతో సంతోషం కలిగిస్తోందని వెల్లని అంటోంది. మరో ఏడాది దాకా ఈ ఎదురుచూపుల్లోని ఉత్కంఠ తనకు కూడా థ్రిల్ కలిగిస్తోందని వెల్లని చెబుతోంది. ఇతరుల సంస్కృతీ సంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి ఇలాంటి క్రాస్ ఓవర్ మూవీస్, అందునా సూపర్ హీరో సినిమాలు మరింతగా దోహదపడతాయని వెల్లని ఆశిస్తోంది. మరి ఈ సినిమా తరువాత వెల్లని హాలీవుడ్ లో మరిన్ని పాత్రలను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.