ఇంగ్లాండ్ పర్యటనలో తీవ్ర ఎదురుదెబ్బలు తగిలిన పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన పాకిస్థాన్, మూడో టెస్టుకు ముందు తీవ్ర కలకలానికి వేదికైంది. రెండో టెస్టు ముగిసిన వెంటనే బోర్డు ఏడుగురు ఆటగాళ్లను స్వదేశానికి తిరిగి పిలిపించడమే కాకుండా, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్, ప్రధాన కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌లను పదవుల నుంచి తొలగించింది. ఈ క్రమంలో ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లతో సహా కొత్త ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించారు. మొదటి టెస్టులో ఇన్నింగ్స్ ఓటమి, రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో ఎదురైన పరాజయాల అనంతరం బోర్డు ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పరిమిత ఓవర్ల జట్టు కోచ్ హెస్సన్‌కు మూడో టెస్టు బాధ్యతలను అప్పగించారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ చర్యలపై పలువురు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పటికీ, మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం బోర్డు నిర్ణయాన్ని సమర్థించారు. పాకిస్థాన్ క్రికెట్ ప్రస్తుతం అత్యవసర పరిస్థితిలో ఉందని, బోర్డు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తూ సరైన దిశలోనే పయనిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. బోర్డు అధికారులు పాత జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, పాకిస్థాన్ తరఫున ఆడాలనే నిజమైన తపన ఉన్న యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ ప్రక్షాళన చేపట్టారని అక్తర్ తెలిపారు.
ఈ మార్పుల కాలంలో సీనియర్ బౌలర్లు షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హారీస్ రవూఫ్‌ల కెరీర్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యమని అక్తర్ స్పష్టం చేశారు. వారిలో ఇంకా ఎంతో క్రికెట్ మిగిలి ఉందని, దేశానికి వారు అందించాల్సింది చాలా ఉందన్నారు. రాబోయే పెద్ద టోర్నీల కోసం తదుపరి తరం ఆటగాళ్లను సిద్ధం చేస్తున్న తరుణంలో, ఈ ముగ్గురు కీలక బౌలర్ల అనుభవం కొత్తగా వచ్చే యువకులకు ఎంతో ఉపయోగపడుతుందని అక్తర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

