వచ్చే యేడాది జరుగబోతున్న ఆస్కార్ అవార్డ్స్ లో ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరికి భారత్ నుండి తమిళ చిత్రం ‘కూళంగల్’ ఎంపికైంది. పి.ఎస్. వినోద్ రాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, నయనతారతో కలిసి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ ఎంట్రీ కోసం వివిధ భాషాల నుండి వచ్చిన సినిమాలను ఒడపోత పోసి మొత్తం 14 చిత్రాలను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ సినిమాలను ఈ నెల 18 నుండి 23 వరకూ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 15 మంది జ్యూరీ సభ్యుల కమిటీ వీక్షించి, ‘కూళంగల్’ను భారతదేశం తరఫున ఆస్కార్ కు అధికారిక చిత్రంగా ఎంపిక చేసింది. ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు షాజీ ఎన్. కరుణ్ ఛైర్మన్ గా వ్యవహరించిన ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుండి ఇద్దరు ఫిల్మ్ జర్నలిస్టులకు చోటు దక్కడం విశేషం. ఫిల్మ్ జర్నలిస్ట్, ప్రొడ్యూసర్, రైటర్ కె. ఉమామహేశ్వరరావుతో పాటు మరో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, ప్రొడ్యూసర్ జి. భగీరథ సైతం సెలక్షన్ కమిటీలో ఉన్నారు. ఆరు రోజుల పాటు కోల్ కత్తాలో ఈ 14 చిత్రాలను చూసి, ఏకాభిప్రాయంతో ‘కూళంగల్’ చిత్రాన్ని వీరు ఎంపిక చేశారు.
Read Also : ‘పెద్దన్న’ టీజర్‌ను విడుదల చేసిన విక్టరీ వెంకటేష్
ఈసారి భారత్ నుండి ఆస్కార్ కు పోటీపడిన చిత్రాలతో ‘షేర్షా (హిందీ), మండేలా (తమిళం), షేర్నీ (హిందీ), ఆట వెల్ జాలీ (మరాఠీ), కూళంగల్ (తమిళం), కాగజ్ (హిందీ), బ్రిడ్జ్ (అస్సామి), తూఫాన్ (హిందీ), ఛల్లో షో (గుజరాతీ), గోదావరి (మరాఠీ), సర్దార్ ఉద్దమ్ (హిందీ), కార్ఖానిసాంచి వారి (మరాఠీ), నాయట్టు (మలయాళం), లైలా ఔర్ సాత్ గీత్ (గోర్జీ) చిత్రాలు ఉన్నాయి. చిత్రం ఏమంటే దేశంలోనే భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు అత్యధిక చిత్రాలను నిర్మించే తెలుగు చిత్రసీమ నుండి ఒక్క సినిమా కూడా ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే కరోనా పేండమిక్ సిట్యుయేషన్ కారణంగా ఈసారి తక్కువ చిత్రాలు వచ్చాయని, కానీ క్వాలిటీ సినిమాలను చూసి ఒడపోత పోయడానికి తాము ఎంతో మేథోమధనం చేయాల్సి వచ్చిందని కమిటీ ఛైర్మన్ షాజీ ఎన్ కరుణ్ తెలిపారు.
