ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో అందరి కళ్ళు బ్లాక్ సూపర్ స్టార్ విల్ స్మిత్ మీదే ఉన్నాయి. ఎందుకంటే గతంలోనూ ఆయన రెండు సార్లు ఆస్కార్ నామినేషన్స్ సంపాదించినా, విన్నర్ గా నిలువలేక పోయారు. ముచ్చటగా మూడోసారి బెస్ట్ యాక్టర్ నామినేషన్ సంపాదించిన విల్ స్మిత్ తన ‘కింగ్ రిచర్డ్’ ద్వారా అనుకున్నది సాధించారు. అవార్డు అందుకోగానే విల్ స్మిత్ మోములో ఆనందం చిందులు వేసింది. దేవుడు తనను ఈ లోకంలో ఉంచినందుకు ఈ రోజున కారణం తెలిసిందని మురిసిపోయారు విల్. అలాగే ఉత్తమ నటుడు విభాగంలో తనకు గట్టి పోటీ ఇచ్చిన మరో నల్లజాతి నటుడు డేంజల్ వాషింగ్టన్ కు ‘థ్యాంక్ యూ డి’ అని చెప్పారు.
గతంలో విల్ స్మిత్, డేంజల్ వాషింగ్టన్.. 2002 సంవత్సరంలోనూ ఆస్కార్ బరిలో పోటీ పడ్డారు. అప్పుడు విల్ తన ‘అలీ’ సినిమాతోనూ, డేంజల్ తన ‘ట్రెయినింగ్ డే’తోనూ బరిలో ఉన్నారు. 2002 ఉత్తమ నటుడుగా ఆస్కార్ ను డేంజల్ సొంతం చేసుకున్నారు. సరిగా ఇరవై ఏళ్ళకు అదే డేంజల్ తో పోటీ పడుతూ విల్ స్మిత్ ఉత్తమ నటునిగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం! ఇక 2007లోనూ ‘పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్’ సినిమాతో బెస్ట్ యాక్టర్ గా నామినేషన్ అందుకున్నారు విల్. కానీ, అప్పుడు ‘ద లాస్ట్ కింగ్ ఆఫ్ స్కాట్లాండ్’తో ఫారెస్ట్ విటాకెర్ అనే నల్లజాతి నటుడు గెలుపు సాధించారు. ఈ సారి ‘కింగ్ రిచర్డ్’తో నిర్మాతగా కూడా బెస్ట్ మూవీ నామినేషన్ సంపాదించారు విల్. కానీ, నటుడిగానే సంతృప్తి చెందవలసి వచ్చింది.
ఆస్కార్ అవార్డ్స్ లో ఎప్పుడూ నల్లజాతి వారికి అన్యాయం జరుగుతూనే ఉందని ఆ మధ్య విశేషంగా దుమారం రేగింది. విల్ తో పాటు ఈ సారి పలువురు పలు విభాగాల్లో నామినేషన్స్ సంపాదించిన బ్లాక్స్ ఉన్నారు. వారిలో ఉత్తమ సహాయనటిగా ‘వెస్ట్ సైడ్ స్టోరీ’తో అరియానా డిబోస్ విజేతగా నిలవడం విశేషం!
ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ దర్శకత్వం విభాగంలో ఓ మహిళ విజేతగా నిలవడం విశేషం. ఈ విభాగంలో బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ అందుకున్న మూడో మహిళగా జేన్ క్యాంపియన్ నిలిచారు. ఆమె తెరకెక్కించిన ‘ద పవర్ ఆఫ్ ద డాగ్’ పది నామినేషన్స్ సంపాదించింది. 2010లో ‘ద హర్ట్ లాకర్’ చిత్రం ద్వారా కేథ్రిన్ బిగేలో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె తరువాత గత సంవత్సరం ‘నోమ్యాడ్లాండ్’ సినిమాతో క్లో ఝవో ఉత్తమ దర్శకత్వంలో ఆస్కార్ ను సొంతం చేసుకున్న రెండవ మహిళగా నిలిచారు. అయితే ప్రస్తుత విజేతగా నిలచిన దర్శకురాలు జేన్ క్యాంపియన్ కు ఓ రికార్డు దక్కింది. బెస్ట్ డైరెక్టర్ విభాగంలో రెండు సార్లు నామినేషన్ పొందిన ఏకైక మహిళగా జేన్ రికార్డ్ సృష్టించింది. 1994లో ‘ద పియానో’ చిత్రం ద్వారా జేన్ బెస్ట్ డైరెక్టర్ నామినేషన్ సంపాదించారు. ఆ యేడాది బెస్ట్ డైరెక్టర్ గా స్టీవెన్ స్పీల్ బెర్గ్ తన ‘షిండ్లర్స్ లిస్ట్’ ద్వారా నిలిచారు. 67 ఏళ్ళ వయసులో జేన్ ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్ అందుకోవడం విశేషాలకే విశేషంగా నిలచింది.
చిత్రమేమిటంటే, ఈ సారి ఉత్తమ చిత్రం విభాగంలో పది సినిమాలు నామినేషన్స్ సంపాదించాయి. వాటిలో ఎక్కువగా సెంటిమెంట్, లవ్, ఎమోషన్ చోటు చేసుకున్నవే ఉన్నాయి. కానీ, అందరినీ ఆశ్చర్య పరుస్తూ హాస్యభరితంగా రూపొందిన ‘కోడా’ బెస్ట్ పిక్చర్ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం! ‘కమింగ్ ఆఫ్ ఏజ్ కామెడీ డ్రామా’గా రూపొందిన ‘కోడా’లో నవ్వుల నడుమే మానవ విలువలను చొప్పించడం వల్లే ఈ సినిమా న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకట్టుకుందని తెలుస్తోంది.
ఉత్తమ నటిగా నిలచిన జెస్పికా ఛస్టేన్ తొలి నుంచీ అందరినీ ఆకర్షిస్తున్నారు. ‘ది ఐస్ ఆఫ్ టామీ ఫేయ్’ చిత్రం ద్వారా జెస్సికాకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు దక్కింది. ఇంతకు ముందు 2013లో ‘జీర్ డార్క్ థర్టీ’ చిత్రం ద్వారా కూడా జెస్సికా బెస్ట్ యాక్ట్రెస్ నామినేషన్ సంపాదించారు. ఆమె కెరీర్ లో ఇప్పుడు అందుకున్నదే తొలి ఆస్కార్ కావడం విశేషం! ఉత్తమ సహాయనటుడుగా ‘కోడా’ చిత్రంలో నటించిన ట్రాయ్ కొట్సుర్ విజేతగా నిలిచారు.
జేమ్స్ బాండ్ సినిమాల్లోని పాటలకు ఓ ప్రత్యేక ఆకర్షణ ఎప్పుడూ ఉంటుంది. డేనియల్ క్రెయిగ్ నటించిన చివరి జేమ్స్ బాండ్ మూవీగా తెరకెక్కిన ‘నో టైమ్ టు డై’లోని “నో టైమ్ టు డై…” అంటూ సాగే పాటకు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ అవార్డు లభించడం విశేషం!
‘బెల్ ఫాస్ట్’ స్క్రీన్ ప్లే రైటర్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రైటర్ గా నిలవగా, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే రైటర్ గా ‘కోడా’ రచయిత సియాన్ హెడెర్ నిలిచారు. అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కిన ‘డ్యూన్’ పది ఆస్కార్ నామినేషన్స్ సంపాదించింది. అయితే ఉత్తమ సాంకేతిక విభాగంలో బెస్ట్ సినిమాటోగ్రాఫర్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సౌండ్ వంటి అవార్డులను సొంతం చేసుకొని ‘డ్యూన్’ సత్తా చాటింది.
నిజానికి ఆస్కార్ అవార్డ్స్ లో బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ , బెస్ట్ స్క్రీన్ ప్లే తరువాత అందరిలోనూ ఆసక్తిని నింపేది బెస్ట్ ఫారిన్ ఫిలిమ్. ఈ విభాగాన్ని ప్రస్తుతం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ అంటున్నారు. జపాన్ సినిమా ‘డ్రైవ్ మై కార్’ ఈ సారి ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ ను కైవసం చేసుకుంది. రోడ్ మూవీ ‘ఉత్తమ విదేశీ చిత్రం’గా నిలవడం విశేషం! ఈ సినిమాకు పది పాయింట్లకు గాను 8.8 పాయింట్స్ తో క్రిటిక్స్ ను మెప్పించింది. పలు వేదికలపై విజేతగా నిలచింది. అలాగే ఆస్కార్ న్యాయనిర్ణేతల మనసులూ గెలుచుకుంది.