Taraka Ratna: కొందరికి కొన్ని సంఖ్యలు అచ్చి వస్తాయి. కొందరికి అచ్చి రావు. అయితే చాలామంది తొమ్మిది సంఖ్యను లక్కీ నంబర్ గా భావిస్తుంటారు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన వాళ్ళు తొమ్మిది నంబర్ మీద మనసు పడి… తమ వెహికిల్స్ కు 9వ నెంబర్ వచ్చేలా చూసుకుంటారు. అంతేకాదు… కొందరైతే ఆల్ నైన్ నంబర్స్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. 1983లో జన్మించిన నందమూరి తారకరత్న ఇరవై యేళ్ళకే చిత్రసీమలోకి హీరోగా అడుగుపెట్టాడు. మరో ఇరవై యేళ్ళకు తరలిరాని లోకాలు వెళ్ళిపోయాడు. చిత్రం ఏమంటే… తారకరత్న జీవితానికి తొమ్మిది సంఖ్యకు విడదీయలేని బంధం ఉంది. టాలీవుడ్… ఆ మాటకు వస్తే… ప్రపంచంలోనే ఏ హీరోకూ లేని రికార్డ్ ఒకటి తారకరత్నకే సొంతం. మొదటి రోజే ఏకంగా తొమ్మిది సినిమాలతో అతని కెరీర్ మొదలైంది. 2003లో నాచారంలోని రామకృష్ణ హార్టికల్చర్ స్టూడియోస్ లో ఒక సినిమా తర్వాత ఒకటిగా ఏకంగా తొమ్మిది చిత్రాల ఓపెనింగ్ జరిగింది. తారకరత్న పుట్టింది 1983 ఫిబ్రవరి 22న. ఈ మొత్తం కలిపితే వచ్చేది తొమ్మిదే! దాంతో ఆ తొమ్మిదో నంబర్ తన కుమారుడికి కలిసి వస్తుందని బహుశా ఆయన తండ్రి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనకృష్ణ భావించారేమో. కానీ ఏ ముహూర్తాన ఆ సినిమాల ప్రారంభోత్సవం జరిగిందో… అందులో చాలా సినిమాలు అసలు సెట్స్ పైకి వెళ్ళనే లేదు. అందులో వైజాగ్ సత్యానంద్ దర్శకత్వం వహించాల్సిన సినిమా కూడా ఒకటి ఉంది. అది కూడా ప్రారంభోత్సవంతోనే ఆగిపోయింది. అలా మొదటిసారి తారకరత్నకు 9 అచ్చి రాలేదనేది అర్థమైంది.
ఇక గడిచిన ఇరవై సంవత్సరాల్లోనూ తారకరత్న దాదాపు పాతిక చిత్రాలలో నటించాడు. అందులో పేరు తెచ్చిపెట్టిన సినిమాలు చేతి వేళ్ల మీద లెక్కపెట్టదగినవే. అలానే ‘9 అవర్స్’ అనే వెబ్ సీరిస్ లోనూ నటించాడు. ప్రముఖ రచయిత మల్లాది రాసిన నవల ఆధారంగా దీనిని క్రిష్ రూపొందించారు. కానీ ఇది కూడా పెద్ద ఆదరణ ఏమీ పొందలేదు. అయితే… అందరితో కలుపుగోలుగా ఉండే తారకరత్న ను ప్రతి ఒక్కరూ అభిమానించే వారు. అతని మరణ వార్త తెలియగానే పేరున్న కథానాయకులే కాదు… క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం తల్లడిల్లిపోయారు. అతనితో తమకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఇక తొమ్మిది తారకరత్నకు అచ్చి రాలేదనడానికి మరో ఉదాహరణ. అతను అనారోగ్యం పాలైన రోజు. జనవరి 27వ తేదీ ‘యువగళం’ కార్యక్రమంలో తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. ఆ తేదీని కూడితే 9 నంబరే వస్తుంది. అలానే 23 రోజుల పాటు హాస్పిటల్ లో అన్ని రకాల ట్రీట్మెంట్స్ జరిగినా…. తుదకు తారకరత్న 18వ తేదీ కన్నుమూశాడు. ఇది కూడా కూడితే వచ్చేది తొమ్మిదే! ఆ రకంగా 9వ నంబర్ తో ఈ ‘ఒకటో నంబర్ కుర్రాడు’కి విడదీయలేని బంధమే ఉందని చెప్పాలి.
ఛాంబర్ లోనే తల్లిదండ్రుల కడసారి చూపు!
తల్లిదండ్రుల అభిష్టానికి వ్యతిరేకంగా తారకరత్న అలేఖ్య రెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే! వీరికి ముగ్గురు పిల్లలు. కొడుకు తమ మాట కాదని ప్రేమపెళ్ళి చేసుకోవడంతో మోహనకృష్ణ, ఆయన శ్రీమతి శాంతి కినుక వహించారు. మనరాళ్ళు, మనవడు పుట్టినా తారకరత్నను మాత్రం దరి చేర్చుకోలేదు. తారకరత్న అనారోగ్యం పాలై హాస్పిటల్ లో చేరిన తర్వాత మాత్రమే అతని గురించి పట్టించుకోవడం మొదలు పెట్టారు. శనివారం రాత్రి తారకరత్న కన్నుమూయడం, అతని పార్ధీవ దేహాన్ని మోకిలా లోని స్వగృహానికి ఆదివారం తరలించడం జరిగింది. బాలకృష్ణ, ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ తదితరులు మోకిలా లోని తారకరత్న ఇంటికి వెళ్ళి భౌతిక కాయానికి నివాళులు అర్పించి, అలేఖ్య రెడ్డిని పరామర్శించారు. కానీ అతని తల్లిదండ్రులు మాత్రం ఫిల్మ్ ఛాంబర్ కు తారకరత్న పార్ధీవ దేహాన్ని తీసుకువచ్చిన తర్వాత మాత్రమే కడసారి చూపుకు వెళ్ళారు. వారికి సన్నిహితులైన కొందరు కూడా మోకిలాకు కాకుండా ఫిల్మ్ ఛాంబర్ కే వెళ్ళి తారకరత్నను నివాళులు అర్పించడం గమనార్హం.