యంగ్ టైగర్ యన్టీఆర్ అభిమానులకు ‘ట్రిపుల్ ఆర్’లో ఆయన అభినయం ఆనందం పంచింది. ఆ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా మొదలవుతుందని అందరికీ తెలుసు. కానీ, కొరటాల శివ రూపొందించిన ‘ఆచార్య’ ఆకట్టుకోలేక పోయింది. దాంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ మదిలోనూ అలజడి రేగిన మాట వాస్తవం! వారిలోని ఆందోళనకు చెక్ పెట్టేసి, ధైర్యం నింపేలా జూనియర్ తో కొరటాల తెరకెక్కించే సినిమా ఫస్ట్ టీజర్ ను విడుదల చేశారు. మే 20న జూనియర్ యన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 19 సాయంత్రం ఈ టీజర్ జనం ముందు నిలచింది. ఈ సినిమా యన్టీఆర్ నటిస్తోన్న 30వ చిత్రం కావడం విశేషం! అందువల్ల ఈ టీజర్ కు ‘ఫ్యూరీ ఆఫ్ యన్టీఆర్ 30’ అని పేరు పెట్టి విడుదల చేశారు.
“అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలియదు… అవసరానికి మంచితనం ఉండకూడదని…” అంటూ ఈ టీజర్ యన్టీఆర్ వాయిస్ తో మొదలవుతుంది. తరువాత “అప్పుడు భయానికి తెలియాలి… తను రావలసిన సమయం వచ్చిందని…” అనీ వినిపిస్తుంది. అలజడి రేపుతూ వర్షంలో సముద్రపు అలలపై ఈ వాయిస్ ను పోస్ట్ చేశారు. చివరగా రెండు చేతుల్లో కత్తి, గొడ్డలి పట్టుకొని యన్టీఆర్ కనీకనిపించకుండా సిల్ హౌట్ షాట్ లో చూపించారు. “వస్తున్నా…” అంటూ వాయిస్ ముగుస్తుంది. యన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పకులు. వారి యన్టీఆర్ ఆర్ట్స్ పతాకంతో పాటు ‘యువసుధ’ సంస్థ కూడా కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. రత్నవేల్ సినిమాటోగ్రాఫర్, సాబూ సిరిల్ ఆర్ట్ డైరెక్టర్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ‘ఫ్యూరీ టీజర్’ ను హిందీతో పాటు దక్షిణాది నాలుగు భాషల్లోనూ విడుదల చేయడం విశేషం!
My next with Koratala Siva… https://t.co/iPyKSQ9Sjs pic.twitter.com/xaEB1ZbwON
— Jr NTR (@tarak9999) May 19, 2022