Virupaksha: ఈ యేడాది తెలుగు నుండి దాదాపు పాతిక పాన్ ఇండియా సినిమాలు విడుదల కాబోతున్నాయి. బాధాకరం ఏమంటే… అందులో ఇప్పటికే విడుదలైన సినిమాలేవీ ఉత్తరాదిన తమదైన ముద్రను వేయలేకపోయాయి. ‘బాహుబలి’ వేసిన బాటలో దక్షిణాదిలోని కొన్ని పాన్ ఇండియా మూవీస్ ఉత్తరాదిన జయకేతనం ఎగరేశాయి. అలానే ‘ఆర్.ఆర్.ఆర్.’ మూవీ సైతం అఖండ విజయాన్ని అందుకోవడంతో పాటు ఆస్కార్ విజేతగా విశ్వవేదికపై సగర్వంగా నిలిచింది. ఈ కారణంగా తెలుగు నుండి పాన్ ఇండియా మూవీ వస్తోందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూడటం మొదలైంది. కానీ గత నెలలో వచ్చిన విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’, నాని ‘దసరా’ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై నిరాశ కలిగించాయి. ‘ధమ్కీ’ మూవీ తెలుగులో కూడా పరాజయం కాగా, ‘దసరా’ ఇక్కడ ఫర్వాలేదనిపించింది. కానీ ఉత్తరాదిన ఈ రెండు సినిమాలూ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి.
తాజాగా శుక్రవారం విడుదలైన సమంత ‘శాకుంతలం’ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయని దర్శక నిర్మాతలు భావించారు. దానికి తగ్గట్టుగానే ప్రచారమూ చేశారు. కానీ తెలుగుతో సహా ఇతర భాషల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాళిదాస విరచిత ‘అభిజ్ఞాన శాకుంతలం’ను దృశ్య కావ్యంగా మలచడంలో గుణశేఖర్ విఫలమయ్యాడని అంటున్నారు. అంతేకాకుండా నిర్మాత నీలిమా గుణ, సమర్పకుడు ‘దిల్’ రాజు ఏ ధైర్యంతో ‘శాకుంతలం’ ప్రీమియర్ షోస్ ను వేశారో అర్థమే కావడం లేదని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాను చూసిన వారంతా పెదవి విరుస్తున్న నేపథ్యంలో, ఫస్ట్ వీకండ్ లో ఏ మాత్రం వసూళ్ళు వస్తాయన్నది చూడాల్సిందే! ఏది ఏమైనా ‘ధమ్కీ’, ‘దసరా’, ‘శాకుంతలం’ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేక పోయాయన్నది వాస్తవం. గమనించాల్సిన విషయం ఏమంటే… తెలుగు నుండి వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమాలే కాదు… దక్షిణాది నుండి వచ్చిన ఉపేంద్ర ‘కబ్జా’, సందీప్ కిషన్ ‘మైఖేల్’, కొరియోగ్రాఫర్ బృంద రూపొందించిన ‘థగ్స్’ మూవీలది కూడా ఇదే పరిస్థితి.
ఇలాంటి టైమ్ లో ఈ నెల 21న రాబోతున్న తెలుగు పాన్ ఇండియా మూవీ ‘విరూపాక్ష’పైనే అందరి దృష్టీ ఉంది. సాయి ధరమ్ తేజ నటించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ కథలో కొంతలో కొంతైనా కొత్తదనం ఉంటే ఓకే కానీ లేదంటే ఉత్తరాది వారిని మెప్పించడం కష్టం. అదే జరిగితే… పాన్ ఇండియా ప్రభ తగ్గుముఖం పట్టే ఆస్కారం ఉంది. పైగా దీని తర్వాత వారంలో అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ కూడా విడుదల కావాల్సి ఉంది. ఇక అదే వారంలో మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్ -2’ కూడా పాన్ ఇండియా మూవీగా రాబోతోంది. అయితే… ఈ సినిమా మొదటి భాగం పెద్దంత మెప్పించలేదు. సో… సహజంగానే దీని మీద ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. ఏదేమైనా… దక్షిణాది నుండి విడుదల అవుతున్న పాన్ ఇండియా మూవీస్ పై నీలినీడలు అలముకున్నట్టే!