తలపతి విజయ్ “బీస్ట్” ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని, ముఖ్యంగా తమిళనాడులో మొదటి రోజు భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే అనుకోని విధంగా “బీస్ట్” మేకర్స్ ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు ఉదయం 4 గంటల నుంచే “బీస్ట్” షోలు పలు చోట్ల ప్రదర్శితం అవ్వగా, ఓ ప్రాంతంలో మాత్రం విజయ్ అభిమానులకు షాక్ తగిలింది.
Read Also : Beast Twitter Talk : మూవీ ఎలా ఉందంటే ?
తమిళనాడులోని కరూర్ జిల్లాలో థియేటర్ యజమానులు, పంపిణీదారుల మధ్య సినిమాపై వివాదం నెలకొందట. ఈ కారణంగా కరూర్ జిల్లాలోని థియేటర్లలో సినిమాను విడుదల చేయలేదు అక్కడి థియేటర్ల యాజమాన్యం. దీంతో రాష్ట్రమంతా ఉన్న విజయ్ అభిమానులు “బీస్ట్” సెలెబ్రేషన్స్ చేసుకుంటుంటే, ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ మాత్రం సినిమా విడుదల చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు “బీస్ట్”ను రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కరూర్ ప్రాంతంలోని థియేటర్లలో మొత్తానికి ‘బీస్ట్’ ఈ రోజు విడుదల కాలేదు. త్వరలో ఈ సమస్యను పరిష్కరించుకుని, మూవీని రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు అభిమానులు. ఇక “బీస్ట్” సినిమాను ఖతార్‌లలో విడుదల చేయకుండా నిషేధించిన విషయం తెలిసిందే.