తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన యువ హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ ఒకడు. వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ.. కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. నిఖిల్ సినిమా అంటే, కచ్ఛితంగా కంటెంట్ ఆసక్తికరంగా ఉంటుందని ఆడియన్స్ చెప్పుకునే స్థాయికి ఎదిగాడు. అయితే.. అర్జున్ సురవరం తర్వాత ఈ యువ హీరో కాస్త నెమ్మదించాడు. ఈ చిత్రంతో పాటు అంతకుముందు చేసిన ‘కిరాక్ పార్టీ’ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ స్పీడు పెంచిన ఈ యువ హీరో.. ఈ ఏడాదిలో మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అవి.. 18 పేజెస్, కార్తికేయ 2, స్పై!
ఆ మూడింటిలో 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. 18 పేజెస్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో రూపొందడంతో, ఈ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. ‘కార్తికేయ 2’ అయితే పాన్ ఇండియా సినిమాగా విడుదలకు ముస్తాబవుతోంది. ఇది ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్. ఈ సినిమా సబ్జెక్ట్ పాన్ ఇండియా అప్పీల్ కలిగి ఉండటంతో, దేశవ్యాప్తంగా ప్రధాన భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక స్పై సినిమా రీసెంట్‌గానే సెట్స్ మీదకి వెళ్ళింది. చకచకా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌ను రంగంలోకి దింపడం విశేషం. పెద్ద సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, దీనిని గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు.
గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఐశ్శర్య మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈడీ ఎంటర్టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నిఖిల్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ సినిమాను.. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.