Dead Pixels: నిహారిక కొణిదెల నాలుగేళ్ళ విరామం తర్వాత నటించిన వెబ్ సీరిస్ ‘డెడ్ పిక్సెల్స్’. ఇది లాస్ట్ ఫ్రైడే నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నిహారికతో పాటు అక్షయ్ లాగుసాని, సాయి రోనక్, హర్ష చెముడు, భావన సాగి కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సీరిస్ లో రాజీవ్ కనకాల, జయశ్రీ రాచకొండ, బిందు చంద్రమౌళి కూడా నటించారు. రాజ్ తరుణ్ తో ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సీరిస్ ను నిర్మించిన తమడా మీడియా ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సీరిస్ ను ప్రొడ్యూస్ చేయడం విశేషం. ఆదిత్య మండల డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సీరిస్ లోని ఫస్ట్ సిక్స్ ఎపిసోడ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
ఇవాళ సినిమాల్లానే వెబ్ సీరిస్ లకూ పెద్దంత కథలు ఎవరూ రాసుకోవడం లేదు. కథనానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇది కూడా అలాంటిదే. ఈ ఆరు ఎపిసోడ్స్ ప్రధానంగా ఐదు పాత్రల చుట్టూనే తిరుగుతుంటాయి. గాయత్రి (నిహారిక), భార్గవ్ (అక్షయ్), ఆనంద్ (హర్ష) హార్డ్ కోర్ గేమర్స్. జీవితంలో క్షణం కూడా వృధా కాకుండా నిత్యం గేమింగ్ లోనే గడిపేస్తుంటారు. గాయత్రి ఫ్లాట్ మేట్ ఐశ్వర్య (భావన) మాత్రం వీళ్ళకు కాస్తంత భిన్నం. మనుషులు ఇరుకిరుకైన గదుల్లో మిగిలిపోకుండా కాస్తంత తలుపులు, కిటీకిలు తీసి బయటి గాలిని పీల్చాలని కోరుకునే మనిషి. గాయత్రి, భార్గవ్, ఆనంద్ కు తోడుగా కొత్తగా వాళ్ళతో రోషన్ (సాయి రోనక్) గేమింగ్ లో చేరతాడు. ఇన్నోసెంట్ గా కనిపించే రోషన్ అంటే గాయత్రికి మొదట్లో పెద్దంత ఆసక్తి లేకపోయినా… మనసులో ఎక్కడో కొద్దిగా సాఫ్ట్ కార్నర్. చిత్రం ఏమంటే… మనుషులు గేమింగ్ లో పడి పరిసరాలను ఎంతలా మర్చిపోతారో ఈ వెబ్ సీరీస్ మూడు ఎపిసోడ్ లో కానీ మనకు తెలియదు. గాయత్రి, ఐశ్వర్య ఉండే ఫ్లాట్ లోనే భార్గవ్ కూడా ఉంటాడు. కానీ వీళ్ళిద్దరు ఫ్లాట్ లో ఎప్పుడు ఒకరికి ఒకరు ఎదురు పడరు. అంతగా ఆఫీస్ వర్క్ లోనూ, గేమింగ్ లోనూ బిజీగా ఉంటారు. ఒకరి పట్ల ఒకరికి ఎలాంటి ఫీలింగ్స్ లేవని పైకి చెప్పుకుంటున్నా, వీరి మధ్య తెలియని క్రష్ ఏదో ఉందని ఐశ్వర్య గమనిస్తుంది. ఇక గేమర్ ఆనంద్ ది మరో టిపికల్ మెంటాలిటీ. భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నా వాళ్ళను పట్టించుకోకుండా అనుక్షణం గేమింగ్ లోనే టైమ్ పాస్ చేస్తుంటాడు. బేసికల్ గా పైలట్ అయిన ఆనంద్… నిద్రలేమితో డ్యూటీ ఎక్కితే ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు. ఇలాంటి చిత్ర విచిత్రమైన క్యారెక్టర్స్ తో ఈ వెబ్ సీరిస్ సాగుతాయి.
‘డెడ్ పిక్సెల్స్’ ప్రధానంగా యూత్ ను టార్గెట్ చేసి తీసింది. అదే మాటను ప్రమోషన్స్ లోనూ చెప్పారు. బట్ చాలా వెబ్ సీరిస్ ల మాదిరిగా ఇది అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి, బోల్డ్ గా తీసింది కాదు. అయినా కొన్ని సీన్, కొన్ని డైలాగ్స్ హద్దులు మీరాయి. మరీ ముఖ్యంగా ఓ ఎపిసోడ్ మొత్తం షిట్ చుట్టూనే తిరగడం కాస్తంత ఎబ్బెట్టుగానే ఉంది. హాస్యం పేరుతో దర్శకుడు పరిథి దాటినట్టు అనిపిస్తుంది. నిజానికి ఇది గేమింగ్ మాయలో పడి విలువైన సమయాన్ని కోల్పోతున్న, మానవీయ విలువలకు దూరమౌతున్న వారికి కనువిప్పు కలిగించేది. కానీ ఆ సందేశం ఎంతవరకూ రీచ్ అవుతుందో చూడాలి!
బిట్టర్ ట్రూత్ ను యాక్సెప్ట్ చేయడం ఇవాళ కష్టం. దాన్ని సెటైర్ ద్వారా తెలియచేయడం ఓ తెలివైన పని. అదే పని డైరెక్టర్ ఆదిత్య మండల చేశారు. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సెటైరిక్ గా తెలిపారు. దాదాపు అన్ని ఎపిసోడ్స్ ఇన్ డోర్ లోనే షూట్ చేశారు. అదీ అరౌండ్ ద టేబుల్! అలా ఓ కంప్యూటర్ ముందు కూర్చుని హావభావాలు ప్రకటించడం అంత సులువేం కాదు. నిహారిక, అక్షయ్, హర్ష ఈ విషయంలో పండిపోయారనిపిస్తుంది. ఎక్కడా మొనాటనీ అనిపించకుండా బాగానే నటించారు. బట్ ముగ్గురులో అక్షయ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. ఇప్పటికే యూత్ ఫుల్ మూవీస్ తో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సాయి రోనక్ ఇందులో చాక్లెట్ బోయ్ గా మెప్పించాడు. రాజీక్ కనకాల కనిపించేది కొద్దిసేపే అయినా అతనికి, అక్షయ్ మధ్య ఉన్న సీన్ బాగున్నాయి. అక్షయ్ పుల్ల రాసిన మాటలు కొన్ని చోట్ల శ్రుతిమించాయి. సిద్ధార్థ సదాశివుని సంగీతం, అబ్దుల్ మజీత్ సినిమాటోగ్రఫీ ఓకే. సమీర్ గోగతే , సాయిదీప్ రెడ్డి బొర్రా, రాహుల్ నిర్మించిన ఈ వెబ్ సీరిస్ రొటీన్ కు కాస్తంత భిన్నమైంది. ఇందులోని ఆంతర్యాన్ని వీక్షకులు గుర్తించగలిగితే… బాగానే ఉంటుంది!